అక్టోబర్ 7న 2023న ప్రారంభమైన గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉంది. గత రెండేళ్లకు పైగా సాగుతున్న ఈ దాడులతోపాటు, లెబనాన్, సిరియా, ఇరాన్‌లపై కూడా ఇజ్రాయిల్ యుద్ధం చేస్తోంది. ఈ సుదీర్ఘ యుద్ధాల వల్ల ఇజ్రాయిల్ ప్రజల్లో తీవ్రస్థాయిలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని పలు ఇజ్రాయిల్ సంస్థలు, పరిశోధకులు, అధికారులు నివేదిస్తున్నారు.
ముఖ్యంగా పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పిటిఎస్డీ) మానసిక రుగ్మత, ఆత్మహత్య కేసుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్‌వాసులలో దాదాపు మూడింట ఒక వంతు మంది తాము వృత్తిపరంగా మానసిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు మక్కాబీ హెల్త్‌కేర్ సర్వీసెస్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.
ముఖ్యంగా సైనికులు, రిజర్విస్టులలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇక 2023 యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సైనిక సిబ్బందిలో పిటిఎస్‌డి కేసులు 40 శాతం పెరిగాయని ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. బహుశా యుద్ధ పరిస్థితులు గనుక ఇలానే కొనసాగితే.. 2028 నాటికి 180 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా.
ఈ యుద్ధ కాలంలో మానసిక ఆరోగ్య కారణాల వల్ల విధుల నుంచి తొలగించిన సైనికుల సంఖ్యను ఇజ్రాయిల్ ప్రభుత్వం వెల్లడించలేదు. కొనసాగుతున్న యుద్ధం వల్ల సైనికులు తీవ్రవమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో అత్యవసర సేవకు ఫోన్ కాల్స్ కూడా 45 శాతం పెరిగాయి. దీంతో ఇజ్రాయిల్ అత్యవసర వైద్య సేవ అయిన మాగెన్ డేవిడ్ అడోమ్ ఒక ప్రత్యేక మానసిక ఆరోగ్య ప్రతిస్పందన విభాగాన్ని ప్రారంభించినట్లు ఈ నెల మొదట్లో వెల్లడించింది.
ఇజ్రాయిల్‌లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా మిలటరీలోనే ఆత్మహత్యల రేటు 2024లో 78 శాతం పెరిగింది. గాజా, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్‌లపై జరిపిన యుద్ధాల వల్ల ఆత్మహత్యల రేటు పెరిగిందని జెరూసలేం పోస్టు వెల్లడించింది. యుద్ధం వల్ల ప్రజల భద్రతా భావన దెబ్బతిన్నది. ప్రభుత్వ సంస్థలు, సైనిక రక్షణపై విశ్వాసం తగ్గిపోయింది. ఈ సమస్య నుంచి కోలువకోడమే తర్వాత దశ అని మానసిక ఆరోగ్య నిపుణురాలు అయిన టులీ ఫ్లింట్ పేర్కొన్నారు.

More Stories
అమెరికా- ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం
కెనడాలో భారత విద్యార్థిని దారుణ హత్య
వాస్తవాధీన రేఖ పరిస్థితిపై భారత్, చైనాలు చర్చలు