తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి కలిసే ముందుకు

తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి కలిసే ముందుకు
రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి కలిసే ముందుకు సాగుతుందని స్పష్టం చేస్తూ టిడిపి మహానాడు రెండవ రోజున రాజకీయ తీర్మానాన్ని  ఆమోదించింది. ‘గడిచిన రెండేళ్లలో కూటమి మైత్రీ బంధం మరింత బలపడింది. ప్రధాని మోదీ, మన అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ చూపుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. జన సేనాని పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యతకు, పాలన జనరంజకంగా సాగడానికి అందిస్తున్న సంపూర్ణ మద్దతు మరువ లేనిది’ అని తెలిపింది.

రాష్ట్రంలో, దేశంలో ఎన్డీయే కూటమి భవిష్యత్తులో మరింత బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని మహానాడు భరోసా వ్యక్తం చేసింది.  బిజెపితో బంధాన్ని గురించి వివరిస్తూ ‘తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో మొగ్గ తొడిగిన తెలుగుదేశం జాతీయ దృక్పథంతో ముందుకు సాగుతోంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూనే, కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు ఇతోధికంగా కృషి చేసింది’ అని స్పష్టం చేసింది.

ఎన్ డిఎ పాలకులైన నాడు వాజ్‌పేయి, నేడు నరేంద్ర మోదీ  ప్రభుత్వాలకు నమ్మకమైన భాగస్వామిగా టిడిపి నిలిచిందని గుర్తు చేస్తూ  రాష్ట్ర ప్రజల క్షేమం కోరి విశాల దేశ ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో జతకట్టామని తెలిపింది. “ప్రధాని నరేంద్ర మోదీ  దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథాన దూసుకెళుతుంది.` అని తెలిపింది.

వచ్చే 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా జనరంజక పాలన సాగిస్తామని తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రకటించింది. ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ కాలం పాలన సాగిస్తేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని, ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, మళ్లీ ఇప్పుడిప్పుడే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని పేర్కొంది.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు చర్యలకు అనుగుణంగా టీడీపీ నాయకత్వం చేపట్టిన ‘హైబ్రిడ్‌’ మహానాడు విజయవంతమైంది. మహిళల కోసం, యువత కోసం, బీసీ వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ వర్గాలను ఆర్ధికంగా ముందుకు తేవటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను, కేంద్ర ఆర్థిక సాయంతో ఆక్సిజన్‌ అందించామని గుర్తుచేశారు. అలాగే దేశంలోనే మొదటిసారి అతివలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే పార్టీగా టీడీపీ నిలిచిందని తెలిపారు. లోకేశ్​ ప్రతిపాదించినట్టుగా తెలుగుదేశం పార్టీలో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు రిజర్వేషన్ కల్పించేలా కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.