నీట్ యూజీ రీ-టెస్ట్‌ను సజావుగా జరిపేందుకు సహకరించండి

నీట్ యూజీ రీ-టెస్ట్‌ను సజావుగా జరిపేందుకు సహకరించండి
 
* ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి 
 
జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ-టెస్ట్‌ను సజావుగా, నిష్పక్షపాతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నిర్వాహకులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు.  తీవ్రమైన వడగాలుల పరిస్థితుల దృష్ట్యా పరీక్ష రాస్తున్న అభ్యర్థుల సౌకర్యం, శ్రేయస్సు కోసం ఎగ్జామ్ సెంటర్ల వద్ద అన్ని ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని వారిని ప్రత్యేకంగా కోరారు. 
నీట్ యూజీ పరీక్ష జరిగే రోజున (జూన్ 21) అభ్యర్థులకు తగిన రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  “ప్రస్తుతం దేశంలో బలంగా వడగాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా నీట్ యూజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్ని రాష్ట్రాల సీఎంలు, యూటీల లెఫ్టినెంట్ గవర్నర్లను కోరుతున్నాను” అని తెలిపారు. 
 
“అలాగే రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో నీట్ యూజీ ప్రవేశ పరీక్షను నిర్వహించే జిల్లా అధికారులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలకు అందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నీట్ పరీక్ష రాసేవారి కోసం సురక్షితమైన తాగునీరు, ఫ్యాన్లు/కూలర్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నీడ ఉండే వెయిటింగ్ ప్రదేశాలు, నిరంతర విద్యుత్ సరఫరా, అవసరమైన చోట పోర్టబుల్ మరుగుదొడ్లును ఏర్పాటు చేయాలి” అని కేంద్ర మంత్రి సూచించారు.
 
విద్యార్థుల ప్రయోజనాలు, శ్రేయస్సే అత్యంత ముఖ్యం. నీట్ యూజీ- 2026 రీటెస్ట్‌ను సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటానికి అన్ని రాష్ట్రాలు తమ పూర్తి సహకారాన్ని అందిస్తాయని ఆ లేఖలో కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను పేపర్ లీక్ అయ్యిందన్న కారణంతో మే 12న రద్దు చేశారు. 
 
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా గెస్​ పేపర్లు బయటకు వెళ్లాయని తెలిపారు. ఎన్‌టీఏ జవాబుదారీతనాన్ని సమర్థిస్తూనే, జూన్​ 21న రీ-టెస్ట్ పెడతామని ఆయన వెల్లడించారు. ఎలాంటి తప్పులు, అక్రమాలకు తావు లేకుండా 100 శాతం పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.