వైమానిక దళాన్ని మరింత శక్తిమంతంచేసే దిశగా భారత రక్షణశాఖ ఫ్రాన్స్ నుంచి మరో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అధికారిక ప్రతిపాదన లేఖను కేంద్రం సిద్ధం చేసింది. రాబోయే కొన్నిరోజుల్లోనే ఆ లేఖను ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపించనున్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ రక్షణ ఒప్పందంలో భాగంగా దాదాపు 90 యుద్ధ విమానాలను ‘మేకిన్ ఇండియా’ కింద ఇక్కడే తయారు చేయనున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ ఓ భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి వీటిని మన దేశంలోనే ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన విమానాలను మాత్రం నేరుగా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మన లేఖకు ఫ్రాన్స్ స్పందించిన తర్వాత అధికారికంగా టెండర్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. భారతదేశ రక్షణ అవసరాలకు సరిపోయేలా రఫేల్ విమానాల్లో కనీసం 50 శాతం మేర స్వదేశీ సాంకేతికత, విడిభాగాలను ఉపయోగించాలని ఢిల్లీ గట్టిగా పట్టుబడుతోంది.
ఈ రఫేల్ ఉత్పత్తి ప్రక్రియలో భారతీయ కంపెనీల పాత్రను మరింత విస్తృతం చేయాలని ఫ్రాన్స్‌ను కోరింది. భవిష్యత్తులో జరగబోయే రక్షణ సహకారాలు కేవలం కొనుగోళ్లకే పరిమితం కాకుండా ఇరు దేశాలు కలిసి డిజైన్, అభివృద్ధి చేసేలా ఒప్పందాలు ఉండనున్నాయి. భారత వైమానిక దళంలో ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. అలాగే నౌకాదళం కోసం మరో 26 రఫేల్-ఎమ్ విమానాల కొనుగోలు ప్రక్రియ కూడా నడుస్తోంది.
ఇప్పటికే మనదేశంలో రఫేల్ విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్, శిక్షణ మౌలిక వసతులు ఉండటంవల్ల మరిన్ని కొత్త విమానాలు వస్తే వాటి రవాణా, నిర్వహణ ఖర్చులు, పైలట్ల శిక్షణ వ్యయం భారీగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు ‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’ ఇప్పటికే ప్రాథమిక క్లియరెన్స్ ఇచ్చింది.
ఇప్పుడు పంపించబోయే లేఖకు ఫ్రాన్స్ నుంచి ధరలు, డెలివరీ సమయం, లాజిస్టిక్స్ మద్దతు వంటి వివరాలతో సమాధానం వస్తుంది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య తుది చర్చలు జరుగుతాయి. ఈ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేయడానికి ముందు ప్రధాని నేతృత్వంలోని ‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ తుది ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది.

More Stories
మేలో 9.68 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం
ట్రంప్ ప్రకటనతో తగ్గిన చమురు ధరలు… స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు
భారత్ విజయాలను `తక్కువ చేసి’ చూపే రాహుల్ ప్రయత్నం