సిఎఎ పరిధిలోకి రాని ప్రతి ఒక్కరూ చొరబాటుదారులే

సిఎఎ పరిధిలోకి రాని ప్రతి ఒక్కరూ చొరబాటుదారులే

* సరిహద్దు కంచె కోసం బిఎస్ఎఫ్ కు భూమిని అప్పగించిన బెంగాల్ 

ఇకపై అక్రమ వలసదారులపై మరింత కఠిన విధానాన్ని అనుసరిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి స్పష్టం చేశారు. పోలీసులు పట్టుకున్న చొరబాటుదారులను నేరుగా బీఎస్ఎఫ్నకు అప్పగించే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని ఆయన వెల్లడించారు. చొరబాటుదారులను నేరుగా బీఎస్ఎఫ్నకు అప్పగించే విషయమై గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక లేఖ పంపిందని, అయితే ఆనాటి మమత ప్రభుత్వం ఈ కీలకమైన నిబంధనను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. 

కాగా, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పరిధిలోకి రాని వారిని చొరబాటుదారులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “రాష్ట్ర పోలీసులు వారిని అరెస్టు చేసి బీఎస్ఎఫ్నకు అప్పగిస్తారు. తర్వాత దేశం నుంచి ఆ అక్రమ చొరబాటుదారులను బహిష్కరిస్తాం” అని తేల్చి చెప్పారు.  పౌరసత్వ చట్టంలోని నిబంధనలను ప్రస్తావిస్తూ, సీఏఏ పరిధిలోకి వచ్చే ఏడు సామాజిక వర్గాలకు చెందినవారు, నిర్ణీత గడువు తేదీకి ముందు భారత్లోకి ప్రవేశించినవారికి మాత్రం మినహాయింపు ఉంటుందని ఆయన చెప్పారు. 

“సీఏఏ కింద ఏడు సామాజిక వర్గాలను పేర్కొన్నాం. 2024 డిసెంబర్ 31 లోపు వచ్చిన వారికి రక్షణ ఉంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోలేరు. ఇక పౌరసత్వ సవరణ చట్టం పరిధిలోకి రానివారిని దేశ బహిష్కరణ ప్రక్రియ ప్రారంభించడం కోసం బీఎస్ఎఫ్ అధికారులు, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత సంస్థ (బీజీబీ)తో సమన్వయం చేసుకుంటారు. ఈ రోజు నుంచే ఈ చట్టం అమలులోకి వస్తుంది” అని సువెందు అధికారి ప్రకటించారు. 

కాగా, బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దు కంచె, భద్రతా మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు భూమిని  ముఖ్యమంత్రి సువేందు అధికారి అప్పగించారు. ప్రాథమికంగా 27కి.మీ మేర సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన భూమిని అందజేశారు. ఇది ఇక్కడితో ఆగదని, రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఎక్కడ అవసరమైతే అక్కడ మరింత భూమిని కేటాయిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. 
 
బీఎస్ఎఫ్ భూ బదిలీ సమావేశంలో మాట్లాడిన సీఎం సువేందు రాష్ట్ర సరిహద్దు భద్రతను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపారు.  రానున్న రెండు వారాల్లోగా ఈ భూమిని బీఎస్ఎఫ్నకు అప్పగిస్తామని, మొదటి విడతగా భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న 27 కి.మీ మేర భూమిని అందిస్తున్నామని చెప్పారు. 
 
“సరిహద్దు మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 2,200 కి.మీ సరిహద్దు ఉండగా, ఇప్పటికే సుమారు 1600 కి.మీ మేర కంచె నిర్మించారు. అయితే దాదాపు 600 కి.మీ మేర సరిహద్దు ఎలాంటి కంచె లేదు. అందువల్ల భద్రత కోసం, కంచె నిర్మాణం కోసంఎక్కడ భూమి అవసరమైనా, దానిని మేము బీఎస్ఎఫ్నకు అప్పగిస్తాం” అని తెలిపారు. 

ఈ సందర్భంగా,  మమతా బెనర్జీ నేతృత్వంలోని గతం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు విధానాలతో సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. పైగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకించిందని ధ్వజమెత్తారు. 

“గత ప్రభుత్వం తన ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు విధానాల కారణంగా బీఎస్ఎఫ్నకు భూమి ఇవ్వలేదు. అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలకు, పాలనా యంత్రాంగం మధ్య సమన్వయ సమావేశాలు జరగలేదు. దీనితో వీరి మధ్య సమన్వయం బలహీనపడింది. అందుకే ఇప్పుడు జిల్లా స్థాయి సమన్వయ యంత్రాంగాన్ని మళ్లీ పునరుద్ధరించాం. ఇకపై ఇవి క్రమం తప్పకుండా జరుగుతాయి” అని తెలిపారు.