బ్యాంకు మోసం కేసులో ఆప్ నేత దీపక్ సింగ్లా అరెస్ట్ 

బ్యాంకు మోసం కేసులో ఆప్ నేత దీపక్ సింగ్లా అరెస్ట్ 
బ్యాంకు రుణ మోసంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో , ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు దీపక్ సింగ్లాకు, మరికొందరికి సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించిన కొన్ని గంటలకే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ఆయన్ని అరెస్టు చేసింది. ఢిల్లీ, గోవాలలో ఈ సోదాలు జరిగాయి. ఉత్తర గోవాలో సోదాలు జరిగిన ఒక ఫ్లాట్‌లో ఆప్ కి చెందిన సంస్థాగత బృంద సభ్యులు కొందరు నివసిస్తున్నారు.
 
దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని సుభాష్ నగర్ లో బాబాజీ ఫైనాన్స్ గ్రూప్ కి చెందిన రామ్ సింగ్ నివాసంపై దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.  పెట్టుబడుల మోసం కింద కొంతమంది వ్యక్తులను రూ.180 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై ఇడి దర్యాప్తు నిర్వహించింది.
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ‘మనీ లాండరింగ్ నివారణ చట్టం’ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధుల అక్రమ తరలింపు ఏమైనా జరిగిందా లేదా అని నిర్ధారించడానికి దర్యాప్తు అధికారులు ఆర్థిక లావాదేవీలు, పత్రాలు, డిజిటల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ తాజా చర్యకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే, ఆరోపించిన బ్యాంక్ మోసం కేసు సంబంధిత దర్యాప్తులో భాగంగా, 2024లోనే సింగ్లాకు సంబంధించిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 
 
ప్రస్తుత ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించనప్పటికీ, కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఏజెన్సీ ఆయన్ని విచారించడం కొనసాగిస్తుందని భావిస్తున్నారు. సింగ్లా 2020, 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, విశ్వాస్ నగర్ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేశారు.
 
ఈ పరిణామాలపై స్పందిస్తూ, సోదాల అనంతరం ఆప్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తమ పార్టీకి సంబంధించిన “సంస్థాగత డేటాను సేకరించడానికి” బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో, ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకురాలు అతిషి మాట్లాడుతూ గోవాలో ఆప్ “ఆదరణ పెరుగుతున్న” సమయంలోనే ఈ సోదాలు జరిగాయని పేర్కొన్నారు. 
 
దర్యాప్తు చర్యల ద్వారా పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. “గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదరణ పెరుగుతుండటంతో, బీజేపీకి నమ్మకమైన అనుచరుడైన ఈడీని ఇక్కడికి కూడా పంపారు! ఈ రోజు తెల్లవారుజాము నుంచే, ఆప్ గోవా సహ-ఇన్‌చార్జ్ దీపక్ సింగ్లా నివాసంలోనూ, అలాగే గోవాలోని కొంతమంది కార్యకర్తల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇది మా కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం మాత్రమే కాదు, బీజేపీ కోసం మా సంస్థాగత సమాచారాన్నంతటినీ సేకరించే ప్రయత్నం కూడా!” అని అతిషి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.