* ఆ తర్వాత మూడో ఏడాది 100 శాతం, నాలుగో ఏడాది 200 శాతం సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ప్రపంచ ఫార్మా పరిశ్రమపై ప్రభావం చూపేలా జనరిక్ మందుల దిగుమతులపై కొత్త టారిఫ్స్ విధానాన్ని ప్రకటించారు. అమెరికాలోనే ఔషధ తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ వెల్లడించారు. ఈ కొత్త విధానం ప్రకారం ఈ ఆగస్ట్ నుంచి దాదాపు రెండేళ్ల పాటు జనరిక్ ఔషధాల దిగుమతులపై ఎలాంటి టారిఫ్స్ విధించబోమని స్పష్టం చేశారు.
అంటే అమెరికాలోకి రాబోయే రెండేళ్లలో వచ్చే జనరిక్ మెడిసిన్‌పై సుంకాలు వర్తించవు. ఇక్కడ భారత్ సహా ఇతర దేశాల నుంచి అమెరికాకు మందులు ఎగుమతి చేసే కంపెనీలకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. అయితే, మూడో ఏడాది ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. నాలుగో ఏడాది ఇది మళ్లీ రెట్టింపు అయి 200 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్లు ప్రకటించారు.
ఇచ్చిన గడువులోగా అమెరికాలో తయారీ ప్లాంట్లు, పరికరాలను ఏర్పాటు చేయని సంస్థలకు జరిమానా విధించేలా కఠిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. విజయవంతంగా అమలవుతున్న పేటెంటెడ్, బ్రాండెడ్ లేదా వినూత్న ఔషధాల విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని, అది యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికాలో ఔషధ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ భారీ సుంకాలు అమల్లోకి వస్తాయి. ప్రపంచంలోనే అమెరికాకు అత్యధికంగా జనరిక్ మందులు సరఫరా చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, సిప్లా, లుపిన్, జైడస్ లైఫ్‌సైన్సెస్, అరబిందో ఫార్మా వంటి భారత కంపెనీల ఆదాయంలో అమెరికా మార్కెట్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ సుంకాలు అమల్లోకి వస్తే భారత కంపెనీలు అమెరికాలో కచ్చితంగా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘అమెరికా ఫస్ట్’ తయారీ విధానంలో భాగంగానే విదేశాల్లో తయారవుతున్న మందుల ఉత్పత్తిని అమెరికాకు తీసుకురావడమే ట్రంప్ ప్రధాన ఉద్దేశం. వచ్చే రెండేళ్లలో ఆయా కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించేందుకు ఇదే మంచి అవకాశం అని ఆయన పేర్కొన్నారు. లేకపోతే భారీ దిగుమతి సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం దేశంలో వినియోగించే మందుల్లో 90 శాతానికిపైగా జనరిక్ ఔషధాలే ఉన్నాయి. రెండేళ్ల గడువు ఇవ్వడంతో కంపెనీలు తమ ఉత్పత్తి, పెట్టుబడి వ్యూహాలను మార్చుకునేందుకు సమయం లభించనుంది.

More Stories
ముడి చమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్లు దాటిపోయే ప్రమాదం
ఇక ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు
ఎల్పీజీ స్థానంలో వంటగ్యాస్‌గా ఇథనాల్!