మరోసారి 90 పైసలు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మరోసారి 90 పైసలు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై రూ.3వరకు పెంచిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగింది.  దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.98.64, డీజిల్ ధర రూ.91.58కు చేరింది.

శుక్రవారం నాడే కేంద్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.3 చొప్పున పెంచింది. దీంతో పెట్రోల్ రూ.94.77 నుంచి రూ.97.77, డీజిల్ రూ.87.67 నుంచి రూ.90.67కు పెరిగింది. తాజా పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59, డీజిల్ రూ.94.08కు పెరిగింది.  కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.70, డీజిల్ రూ.96.07కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.49, డీజిల్ రూ.96.11కు పెరిగింది.

కోల్‌కతాలో పెట్రోల్‌పై అత్యధికంగా 96 పైసల పెంపు నమోదైంది. దాని తర్వాత ముంబైలో పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 94 పైసలు పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌పై 82 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకావం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ధరల పెంపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొంత ఉపశమనం కలిగించిందని, దీనివల్ల రెండు ఆటోమొబైల్ ఇంధనాలు, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) అమ్మకాలపై వాటి రోజువారీ ఉమ్మడి నష్టాలు నాలుగో వంతు, అంటే సుమారు రూ. 250 కోట్లు తగ్గాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పెట్రోలియం 
 
మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ప్రకారం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, మరియు హిందుస్థాన్ పెట్రోలియం అనే మూడు ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం మార్కెట్ ధరల కంటే తక్కువకు పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీలను అమ్మడం ద్వారా రోజుకు సుమారు రూ. 750 కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి. దేశీయ విమానాలకు జెట్ ఇంధన విక్రయాలపై చమురు మార్కెటింగ్ సంస్థల  ‘అండర్-రికవరీ’ని ఈ నష్ట గణాంకాలు పరిగణనలోకి తీసుకోలేదని శర్మ తెలిపారు. 
ఇరాన్ పై సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 111 డాలర్లు దాటింది. దీంతో మరోసారి ధరల పెంపు తప్పదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.