అదానిపై అమెరికాలో నమోదైన కేసులన్నీ ఉపసంహరణ

అదానిపై అమెరికాలో నమోదైన కేసులన్నీ ఉపసంహరణ
 
* 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదన 
 
కోర్టు రికార్డుల ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం సోమవారం గౌతమ్ అదానీపై ఉన్న క్రిమినల్ మోసం ఆరోపణలను కొట్టివేయడంతో పాటు, ఆయన ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించిన ఇరాన్ ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలను కూడా పరిష్కరించింది. ప్రాసిక్యూటర్లు ఆరోపణలను నిరూపించలేమని నిర్ధారించిన తర్వాత, అమెరికా న్యాయ శాఖ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీపై ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను శాశ్వతంగా ఉపసంహరించుకుంది. 
 
దీంతో న్యూయార్క్‌లో జరుగుతున్న ఈ హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసు పూర్తిగా ముగిసింది. దీంతో, గత రెండు రోజుల్లో ఈ గ్రూప్‌కు సంబంధించిన అనేక అమెరికా నియంత్రణ, చట్టపరమైన దర్యాప్తులు అన్నీ ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యక్తిగత న్యాయవాదిగా కూడా ఉన్న అదానీ న్యాయవాది రాబర్ట్ గిఫ్రా జూనియర్, ఒక ప్రజెంటేషన్‌లో, అదానీ అమెరికాలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనుకున్నారని, కానీ కేసుల కారణంగా అలా చేయలేకపోయారని చెప్పినట్లు గత వారం న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 
 
దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటును అభివృద్ధి చేయడానికి అదానీ గ్రూప్ అనుమతి పొందటం కోసం, భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచం చెల్లించడానికి అదానీ అంగీకరించారని ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రూప్ తాము ఎలాంటి తప్పు చేయలేదని నిరంతరం ఖండిస్తూనే ఉంది. అదానీ ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. 
 
అంతేకాదు ఇరాన్‌ నుంచి ఎల్‌పీజీ (వంటగ్యాస్‌) దిగుమతులకు సంబంధించిన కేసులో కూడా రిలీఫ్ దక్కింది. ఎల్‌పీజీ ఆంక్షలు ఉల్లంఘించినందుకు నమోదైన కేసులో.. అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఓఎఫ్‌ఏసీ (ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ అసెట్స్‌ కంట్రోల్‌) ద్వారా పరిష్కరించుకున్నారు. అయితే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ కేసు పరిష్కారం కోసం 275 మిలియన్‌ డాలర్లు (రూ.2600 కోట్లకు పైగా) చెల్లించేందుకు సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. 
 
అలాగే దర్యాప్తునకు సహకారం అందించడంతో పాటుగా ఎప్పటికప్పుడు వివరాలను వెల్లడిస్తామని ఓఎఫ్‌ఏసీకి తెలిపింది. ఈ కేసు పరిష్కారం నేర నిర్థారణ, తప్పు చేసినట్లు చూడొద్దని అదానీ కంపెనీ తెలిపింది.  అదానీ గ్రూపు అమెరికా ఆంక్షలను అతిక్రమించి 2023 నవంబరు నుంచి నుంచి 2025 జూన్‌ వరకు ఇరాన్‌ నుంచి ఎల్‌పీజీ దిగుమతి చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. 
 
ఇరాన్ నుంచి నేరుగా ఎల్‌పీజీని దిగుమతి చేసుకోకుండా మధ్యలో మరో కంపెనీ ద్వారా ఒమన్‌, ఇరాక్‌ నుంచి తప్పుడు పత్రాలతో దిగుమతి చేసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో తాజాగా సెటిల్‌మెంట్ చేసుకున్నారు. మొత్తానికి అదానీలు అమెరికాలో నమోదైన రెండు ప్రధాన కేసుల నుంచి బయటపడ్డారు.