బిజెపి లక్ష్యంగా బండి సంజయ్ పై బిఆర్ఎస్ వ్యక్తిగత దాడులు!

బిజెపి లక్ష్యంగా బండి సంజయ్ పై బిఆర్ఎస్ వ్యక్తిగత దాడులు!
* సంజయ్ తప్పు చేస్తే పార్టీ తగు చర్య తీసుకుంటుంది!
 
బీఆర్ఎస్ వంటి పార్టీల వైఖరి వల్ల తెలంగాణ రాజకీయ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని పేర్కొంటూ ఆ పార్టీ నాయకులు, బిజెపిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారం, అనుకూల మీడియా ద్వారా బీజేపీకిని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని, ముఖ్యంగా కేటీఆర్ ఈ ప్రచారాన్ని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, ఒకవేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పు చేసి ఉంటే పార్టీ కూడా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
 
కాని ఇక్కడ జరిగింది ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిందని, ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేసి ఉంటే చట్టం తన పని చేస్తుందని, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. చట్టపరమైన హక్కుల ప్రకారం ఎవరైనా ముందస్తు బెయిల్ తీసుకోవచ్చని, అది పారిపోవడం కాదని, చట్టంలో ఉన్న హక్కును వినియోగించుకోవడమే అని రామచందర్ రావు తేల్చి చెప్పారు. 
అయితే, ముందు బీఆర్ఎస్ నాయకులు తమ పాలనలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతి అంశంపై విచారణలు ప్రారంభమయ్యాక కోర్టులను ఆశ్రయించిన వారు, ఇప్పుడు నైతికత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో మహిళలపై నేరాలు భారీగా జరిగాయని పేర్కొంటూ ఎన్ సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2014లో తెలంగాణలో మహిళలపై నమోదైన కేసులు 14,147 ఉండగా, 2023 నాటికి అవి 23,679కి చేరాయని తెలిపారు.
అంటే మహిళలపై నేరాలు సుమారు 67 శాతం పెరిగాయని, దీనికి సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమే అని స్పష్టం చేశారు.  “మీరు ముందుగా మీ పాలనలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలి” అని నిలదీశారు.  “2022లో జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటన జరిగింది. 2019లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమత అనే 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇవన్నీ మీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలే. ఈ ఘటనలపై మీ నైతిక బాధ్యత ఎక్కడికి పోయింది” అని బిజెపి నేత ప్రశ్నించారు.  
 
డాక్టర్‌ ప్రీతి వేధింపులను తట్టుకోలేక 2023లో వరంగల్‌లో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. దీనికి బిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించదా? ముఖ్యమంత్రి బాధ్యత వహించరా?  అని నిలదీశారు. అదేవిధంగా అదే పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్‌ తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఘటన కూడా జరిగిందని తెలిపారు. 
అలాగే సూర్యాపేట జిల్లాకు చెందిన లంబాడ గిరిజన యువతి లక్ష్మి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో మృతి చెందిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని రామచందర్ రావు తెలిపారు. పోలీసుల వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలు వచ్చాయని చెబుతూ  ఇవన్నీ మహిళలపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి ఉదాహరణాలని చెప్పారు.   
“అంతేకాదు, కేటీఆర్..! మీ పాలనలో టీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు, నాయకులు కూడా పలు అత్యాచార, మహిళా వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. టీఆర్ఎస్ నాయకులతో సంబంధాలున్న వ్యక్తులు యువతులను డ్రగ్స్ ఇచ్చి కిడ్నాప్ చేసిన కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కూడా టీఆర్ఎస్‌కు సంబంధించిన నాయకుల పేర్లు వినిపించాయి” అని గుర్తు చేశారు.
ఇంతటి దారుణ చరిత్ర బీఆర్ఎస్ పై ఉన్నప్పుడు, ఇప్పుడు మహిళల హక్కులు, మైనర్ల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు ఎక్కడుంది? అని బిజెపి నేత ప్రశ్నించారు. ఆ ఘటనల సమయంలో కేసీఆర్ రాజీనామా చేశారా? కేటీఆర్ బాధ్యత తీసుకున్నారా? ఎవరైనా నైతిక బాధ్యత వహించారా? అని ప్రశ్నించారు.  కేటీఆర్ కుటుంబ సభ్యురాలినే కవిత పైవచ్చిన లిక్కర్ స్కామ్ ఆరోపణల సమయంలో కూడా బీఆర్ఎస్ నాయకత్వం రాజీనామాలు చేయలేదని గుర్తు చేశారు.   
 
ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటన, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమత కేసు, డాక్టర్‌ ప్రీతిపై వేధింపుల కేసు, సర్పంచ్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వంటి అనేక ఘటనలు బీఆర్ఎస్ పాలనలోనే చోటుచేసుకున్నాయని వివరించారు.