పార్లమెంటరీ కమిటీలకు 47 శాతం ఎంపీలు గైరాజర్

పార్లమెంటరీ కమిటీలకు 47 శాతం ఎంపీలు గైరాజర్
పార్లమెంటరీ కమిటీల సమావేశాలకు ఎంపీలు తరచుగా గైర్హాజరవుతున్నారు. దీంతో కోరం  (కనీసం 11 మంది సభ్యుల హాజరు) లేక 5 కీలక సమావేశాలు వాయిదా పడ్డాయి. గత సెప్టెంబర్‌లో పునర్‌వ్యవస్థీకరించబడినప్పటి నుండి నిర్వహించిన 16 స్థాయి సంఘాలు, ప్రజా ఖాతాల కమిటీ (పిఎసి) సమావేశాలకు సగటున 53 శాతం మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు.   సగటున దాదాపు 47 శాతం మంది సభ్యులు గైర్హాజరయ్యారని లోక్‌సభ వెబ్‌సైట్ లోని గణాంకాలు తెలిపాయి. 
పార్లమెంటరీ కమిటీలకు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని ప్రధాని మోదీ స్పష్టం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం గమనార్హం.  కోరం లేక ‘టెలికాం తయారీ రంగంలో స్వావలంబన’పై చర్చించాల్సిన కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశంతో పాటు, జలవనరుల స్టాండింగ్ కమిటీకి చెందిన రెండు ముఖ్యమైన సమావేశాలు రద్దయ్యాయి. 
గతేడాది నవంబర్ 10న నమామి గంగే, జాతీయ నదీ పరిరక్షణ ప్రాజెక్టులపై చర్చించాల్సిన సమావేశం, అలాగే ఈ ఏడాది జనవరి 5, 2026న పీఎంకేఎస్‌వై (పిఎంకెఎస్ వై) నీటి నిర్వహణ, వాప్కోస్, ఎన్‌పీసీసీ సంస్థల పనితీరుపై సమీక్షించాల్సిన సమావేశాలు కోరం లేక వాయిదా పడ్డాయి.  వీటితో పాటు ఏప్రిల్ 8, ఏప్రిల్ 22 తేదీల్లో భూ వనరులు, గిరిజన వ్యవహారాలు, గనుల మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో జరగాల్సిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ స్థాయీ సంఘం సమావేశాలు కూడా సభ్యులు హాజరుకాకపోవడంతో నిలిచిపోయాయి. 
 
ప్రస్తుతం ప్రతి పార్లమెంట్ స్థాయి సంఘంలో 31 మంది సభ్యులు (లోక్‌సభ నుండి 21, రాజ్యసభ నుండి 10), అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి)లో 22 మంది సభ్యులు (లోక్‌సభ నుండి 15, రాజ్యసభ నుండి 7) ఉన్నారు. అత్యంత ప్రాధాన్యత గల జాతీయ అంశాలపై చర్చించాల్సిన సమయాల్లో సభ్యుల గైర్హాజరు వల్ల కమిటీల పర్యవేక్షక బాధ్యతలకు ఆటంకం కలుగుతోంది.  ఏప్రిల్ 10న జరిగిన పార్లమెంటరీ వ్యవసాయ స్థాయీ సంఘం సమావేశానికి కేవలం 12 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
అయితే, వీటికి భిన్నంగా రైల్వేలు, పెట్రోలియం, సహజ వాయువు, విదేశాంగ వ్యవహారాలు, ఆర్థిక శాఖలకు సంబంధించిన స్థాయి సంఘాల సమావేశాలలో సభ్యుల హాజరు మెరుగ్గా ఉంది.  విదేశాంగ వ్యవహారాల స్థాయి సంఘ సమావేశాలలో మిశ్రమ స్పందన లభించింది. 2025 అక్టోబర్ 29న జరిగిన సమావేశంలో కేవలం 13 మంది, అక్టోబర్ 30 నాటి సమావేశంలో 11 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న జరిగిన సమావేశానికి మాత్రం ఏకంగా 28 మంది సభ్యులు హాజరయ్యారు.