11వ శతాబ్దం నాటి చోళుల రాగి పలకలు భారత్ కు అప్పగింత

11వ శతాబ్దం నాటి చోళుల రాగి పలకలు భారత్ కు అప్పగింత
వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి భారత్, నెదర్లాండ్స్ సంబంధాలు 

ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్​తో శనివారం నిర్వహించిన ప్రతినిధి స్థాయి చర్చల్లో రెండు దేశాలు తమ బంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఆవిష్కరణలు, పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధి, రక్షణ, సెమీకండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీ తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించాయి. 

ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి పలకల్ని తిరిగి ఇచ్చేందుకు నెదర్లాండ్స్ అంగీకరించిందని ప్రధాని మోదీ వెల్లడించారు.  ‘‘11వ శతాబ్దం నాటి చోళుల పలకల్ని నెదర్లాండ్స్ భారత్ కు తిరిగి ఇచ్చేయబోతుంది. దీనికి సంబంధించిన అప్పగింత ప్రక్రియలో నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్‌తో కలిసి పాల్గొన్నా. ఇందులో 21 పెద్ద పలకలు, 3 చిన్న పలకలు ఉన్నాయి” అని ప్రధాని వెల్లడించారు. 
 
“వాటిపై ప్రపంచంలోనే అత్యంత అందమైన భాషల్లో ఒకటైన తమిళం ఉంది. ఇది రాజరాజ చోళుడి తనయుడు రాజేంద్ర చోళ కాలం నాటిది. చోళుల గొప్పదనానికి ఇది నిదర్శనం. భారతీయలు చోళుల పాలన, సంస్కృతి గురించి గర్వపడుతుంటారు. ఈ పలకల్ని అప్పగించిన నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, 19వ శతాబ్దం నుంచి వీటిని రక్షిస్తున్న లీడెన్ యూనివర్సిటీకి ధన్యవాదాలు” అంటూ మోదీ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని కూడా మోదీ షేర్ చేశారు.
 
నెదర్లాండ్స్‌లోని ది హేగ్​ సిటీలో జరిగిన చర్చల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని పేర్కొన్నారు. నెదర్లాండ్స్ నైపుణ్యాన్ని, భారత్ వేగం నైపుణ్యంతో కలిపితే ద్వైపాక్షిక సహకారం కొత్త స్థాయికి చేరుకుంటుందని మోదీ తెలిపారు. ఆవిష్కరణలు, పెట్టుబడులు, సుస్థిరత, రక్షణ రంగాల్లో కలిసి ముందుకు సాగాలని సూచించారు. 

భారత్‌కు నెదర్లాండ్స్ అత్యంత ముఖ్యమైన భాగస్వామ్య దేశాల్లో ఒకటని మోదీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, బాధ్యతాయుత ప్రవర్తన రెండు దేశాల ఉమ్మడి దృక్పథమని తెలిపారు. ఇదే విజన్‌తో భారత్- నెదర్లాండ్స్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు.

దాదాపు పదేళ్ల తర్వాత నెదర్లాండ్స్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. గత దశాబ్దంలో ద్వైపాక్షిక సంబంధాలు విశేషంగా పురోగతి సాధించాయని చెప్పారు.   చర్చల అనంతరం ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా టాటా ఎలక్ట్రానిక్స్,  ఏఎస్ఎంఎల్ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం కీలకంగా మారింది. 

గుజరాత్‌లోని ధోలేరా సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్రాజెక్టుకు ఇది తోడ్పడనుంది. భారత్‌తో ఏఎస్ఎంఎల్ కుదుర్చుకున్న తొలి భాగస్వామ్యం ఇదేనని విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జోర్జ్​ తెలిపారు. ఈ ఒప్పందం భారత సెమీకండక్టర్ రంగ అభివృద్ధికి పెద్ద ఊతమిస్తుందని పేర్కొన్నారు.