పేపర్ లీక్ అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరమని పేర్కొంటూ కొన్ని అంశాలనే టార్గెట్‌గా చేసుకుని రాహుల్‌గాంధీ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి జెపి నడ్డా మండిపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పేపర్లు లీక్ జరిగిందని, తెలంగాణలో ఇంటర్ పేపర్, కేరళ, తమిళనాడులో పేపర్లు లీక్ అయ్యాయని తెలిపారు. బంగాల్, కర్ణాటకలోనూ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని పేర్కొన్నారు.
కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం బాధ్యయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసనల నేపథ్యంలో నడ్డా ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాకు వివరాలు తెలియజేశారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పేపర్ లీక్‌తో సంబంధమున్న అన్ని అంశాలపై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
విపక్షాలు అడిగే ప్రశ్నలకు పార్లమెంటులో సమాధానాలు ఇస్తామని చెబుతూ అయితే, విపక్షాలు చీటికిమాటికి గోల్‌పోస్టు మారుస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్ గురించి తమకు పూర్తి బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో గత పదేళ్లలో జరిగినట్లుగా ఆరోపిస్తున్న పేపర్ లీక్‌ల గురించి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నడ్డా స్పందించారు.
ఆరోపిత 152 పేపర్ లీక్‌ల వ్యవహారం “విచారణకు సంబంధించిన అంశం” అని పేర్కొన్న ఆయన, ఢిల్లీలో భారీ నిరసనలకు దారితీసిన ప్రస్తుత నీట్ పేపర్ లీక్ సమస్యపై పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. “ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.అందులో ఆయన సుమారు 150 పేపర్ లీక్‌ల గురించి ప్రస్తావించారు. ఇది విచారణ జరగాల్సిన అంశం. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, మేము కచ్చితంగా దీనిపై విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు, దేశానికి తెలియజేస్తాము,” అని చెప్పారు.
రాజ్యసభలో సభ నాయకుడిగా ఉన్న నడ్డా, పేపర్ లీక్ సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని, చర్చ ఎంత సమయం జరగాలనేది ప్రతిపక్షమే నిర్ణయించుకోవచ్చని చెప్పారు. “మేము దీనిపై (పేపర్ లీక్‌ల గురించి) పార్లమెంటులో చర్చ జరగాలని కోరుకుంటున్నాము. స్వల్పకాలిక చర్చా లేదా దీర్ఘకాలిక చర్చా అనేది మీ ఇష్టం; బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీరు ఎంత సమయం కావాలో నిర్ణయించుకోండి.”
“మీరు 12 గంటలు లేదా 18 గంటలు తీసుకోవచ్చు. రాజ్యసభలో సభ నాయకుడిగా, ప్రతిపక్షం ఎన్ని గంటల చర్చను నిర్ణయిస్తే అన్ని గంటలు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నేను ఎప్పుడూ భావిస్తాను. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది, ప్రతిపక్షం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వైఖరిని మార్చుకోకూడదు,” అని ఆయన జోడించారు.
అంతేకాకుండా, ప్రతిపక్షం తమ “బాధ్యతను నిర్వర్తించాలని”, “శాశ్వత పరిష్కారం” కనుగొనే దిశగా కృషి చేయాలని నడ్డా కోరారు. “పిల్లలు మనందరివారు, వారు దేశ భవిష్యత్తు. దేశ భవిష్యత్తును కాపాడటం మన బాధ్యత. ఈ బాధ్యతలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ భాగమే. కాబట్టి, ప్రతిపక్షం తమ బాధ్యతను నిర్వర్తించాలని నేను కోరుతున్నాను. ఈ సమస్యను పరిష్కరించడానికి, శాశ్వత పరిష్కారం వైపు ముందుకు సాగడానికి మనమందరం కలిసి పనిచేయాలి,” అని ఆయన పిలుపిచ్చారు.
విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాం
మరోవంక, విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని నీట్ పేపర్ లీక్ ఆందోళనకారులకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను విపక్షాలు కీలుబొమ్మలుగా చేసుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థులు, యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కొందరు ప్రతిపక్ష నాయకులు విద్యార్థుల్లో కోపావేశాలను సృష్టిస్తున్నారని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువతను తప్పుదోవ పట్టించడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో కాకుండా వీధుల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రతిపక్షం అనుచితమైన ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య సమస్యలను చర్చించడానికి సరైన వేదిక పార్లమెంట్ భవనమని, అక్కడ ప్రతిపక్షానికి తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించే పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపారు.

More Stories
అసాంఘిక శక్తుల చేతుల్లోకి ఢిల్లీ సిపిజే నిరసనలు
రాజధాని నిరసనలను చక్కదిద్దెందుకు ప్రభుత్వ ప్రయత్నాలు ముమ్మరం
రామమందిర వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక ధార్మిక కమిటీ