144 ఓట్ల‌తో బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన సీఎం విజ‌య్‌

144 ఓట్ల‌తో బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన సీఎం విజ‌య్‌

* వివాదాస్పద ఓఎస్‌డీ నియామకం రద్దు

త‌మిళ‌నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజ‌య్ బుధవారం బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గారు. ఆయ‌న‌కు అనుకూలంగా 144 మంది ఓటేశారు. 22 మంది వ్య‌తిరేకంగా ఓటేశారు. అయిదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక డీఎంకే పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే రెబ‌ల్స్  25 మంది షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కానీ ప‌ళ‌నిస్వామి వ‌ర్గం మాత్రం వ్య‌తిరేకంగా ఓటేసింది.

పీఎంకే, బీజేపీకి చెందిన మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా నిలిచారు.  ఏఎంఎంకే బహిష్కృత ఎమ్మెల్యే కామరాజు సైతం విజయ్‌కు మద్దతు ఇచ్చారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న డీఎండీకే సైతం విజయ్‌కు మద్దతు తెలిపింది.  అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ జేసీడి ప్రభాకర్ ప్రకటించారు.

టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 108 స్థానాల్లో నెగ్గింది.  విజ‌య్ రెండు చోట్ల నెగ్గ‌డంతో ఓ స్థానం ఖాళీ అయ్యింది. ఇక ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే బ‌ల‌ప‌రీక్ష‌లో పాల్గొన‌లేదు. అయితే విశ్వాస‌ప‌రీక్ష క‌న్నా ముందే కాంగ్రెస్‌తో పాటు వామ‌ప‌క్షాలు విజ‌య్‌కు మ‌ద్దతు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాడు అసెంబ్లీలో 117 మ్యాజిక్ మార్క్‌. బ‌ల‌ప‌రీక్షపై చ‌ర్చ‌ త‌ర్వాత అసెంబ్లీలో సీఎం విజ‌య్ మాట్లాడుతూ త‌మ స‌ర్కారు సెక్యూల‌ర్ విధానానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు.

త‌మ ప్ర‌భుత్వం వేగ‌వంత‌మైన గుర్రం త‌ర‌హాలో ప‌నిచేస్తుంద‌ని, కానీ హార్స్ ట్రేడింగ్‌కు పాల్ప‌డ‌ద‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాల‌కు చెందిన అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను త‌మ ప్ర‌భుత్వం కొన‌సాగిస్తుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. 

బలపరీక్షకు ముందుగానే విజయ్‌, తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని డీఎంకే నేత ఉధయనిధి స్టాలిన్ ఆరోపించారు. 65 శాతం తమిళనాడు ఓటర్లు విజయ్‌కి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు. తమ కూటమి పక్షాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని విజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇలా ఉండగా, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తన ప్రభుత్వంలో తీసుకున్న ఒక కీలక నియామకాన్ని  24 గంటల్లోగా వెనక్కి తీసుకున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారిగా వ్యక్తిగత జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. నియామక ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రతిపక్షాలతో పాటు మద్దతు ఇస్తున్న పక్షాలు సహితం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనకడుగు వేయక తప్పలేదు.