ఈ నెల 11న తన నాయనమ్మ, ‘మదర్-ఎ-మెహర్బాన్’గా పేరుగాంచిన బేగం అక్బర్ జహాన్ 26వ వర్ధంతి సందర్భంగా జరిగిన పార్టీ సమావేశంలో ఒమర్ అబ్దుల్లా తన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని పేర్కొంటూ జమ్మూ డివిజన్‌కు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేను ఒక సీనియర్ బీజేపీ నేత సంప్రదించారని, పార్టీ మారితే రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు, మంత్రి పదవి, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని ఆఫర్ చేశారని ఆరోపించారు.
సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఒక సీనియర్ బీజేపీ నేత ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామంపై స్పందిస్తూ, సిఎం అబ్దుల్లా, దీనిని తాను “గొప్ప గౌరవంగా” భావిస్తున్నానని పేర్కొంటూ ఆ లీగల్ నోటీసును “ప్రేమలేఖ”గా అభివర్ణించారు.
“నాకు ఒక న్యాయవాది నుండి ఎలక్ట్రానిక్ కాపీ రూపంలో ఒక లేఖ అందింది. జమ్మూ కాశ్మీర్‌లో బిజెపి నుండి ఇలాంటి ప్రేమలేఖను అందుకున్న ఏకైక రాజకీయ నాయకుడిని నేనే కాబట్టి, దీనిని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నేను జమ్మూ కాశ్మీర్‌లో స్పష్టంగా ఒక రాజకీయ శక్తిని అని, నన్ను వారు విస్మరించలేరని తెలియజేసే గౌరవానికి ఇది ఒక చిహ్నంగా నేను భావిస్తున్నాను,” అని తెలిపారు.
ఒమర్ వ్యాఖ్యలతో తమ పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగిందని బీజేపీ పేర్కొన్నది. జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సత్‌పాల్ శర్మ ఆదేశాల మేరకు అడ్వకేట్ పరిమోక్ష్ సేథ్ ద్వారా ఈ లీగల్ నోటీసును పంపింది.
ఒమర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకమైనవని నోటీసులో స్పష్టంచేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నది. గడువులోగా ఒమర్ స్పందించకపోతే రూ.100 కోట్ల నష్టపరిహారం కోరుతూ సివిల్ పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరించింది.
దీంతోపాటు చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభిస్తామని నోటీసులో బిజెపి స్పష్టంచేసింది. రాజకీయంగా ప్రేరేపితమైన ఈ వ్యాఖ్యల వెనుక తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర ఉందని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.
అయితే,తాను ఒక రాజకీయ ప్రకటన చేసినందున బిజెపి నుండి రాజకీయ ప్రతిస్పందనను ఊహించానని చెబుతూ “బిజెపి పోరాడే తీరుకు ఇది ప్రతీక. వారు రాజకీయ పోరాటాలు చేసి కోర్టుల వెనుక దాక్కుంటారు,” అని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా ఇలా వాదించారు: “నేను కూడా అదే ప్రకటన చేసి, అసెంబ్లీ రక్షణలో తలదాచుకుని ఉండవచ్చు. అసెంబ్లీలో చేసే వ్యాఖ్యలను బయట ఎవరూ సవాలు చేయలేరు కాబట్టి, ఆ సదుపాయాన్ని నేను ఉపయోగించుకుని ఉండవచ్చు; కానీ నేను అలా చేయలేదు.”

More Stories
నేపథ్య గాయని జానకి `పద్మ భూషణ్’ ఎందుకు తిరస్కరించారు?
ఢిల్లీ అల్లర్లలో ఐబీ అధికారి హత్య కేసులో దోషిగా ఆప్ నేత
సింగరేణిలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీ