అధికారంపై ఆశతో కాంగ్రెస్‌ మిత్రద్రోహం

అధికారంపై ఆశతో కాంగ్రెస్‌ మిత్రద్రోహం

* బెంగళూరులో ప్రధాని సభకు సమీపంలో జిలెటిన్‌ స్టిక్స్‌ కలకలం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ మిత్రపక్షాలకూ, ప్రజలకూ ఒకేలా ‘ద్రోహం’ చేస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల ఖర్చుతో బతుకుతున్న ‘పరాన్నజీవి రాజకీయ శక్తి’గా దానిని అభివర్ణించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కర్ణాటకలో పర్యటించిన ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల భారీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. 
 
తమిళనాడులో తమ చిరకాల మిత్రపక్షమైన డీఎంకేకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా ఆ పార్టీ తన సొంత సంకీర్ణ భాగస్వాములకు పదేపదే వ్యతిరేకంగా మారుతోందని కూడా ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీవి అవకాశవాద రాజకీయాలని దుయ్యబట్టారు. 30 ఏళ్లుగా డీఎంకేతో కాంగ్రెస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డీఎంకేతో పొత్తువల్లే కాంగ్రెస్‌ అనేకసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని ప్రధాని గుర్తుచేశారు. 
 
2014కు ముందు పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం డీఎంకే వల్లే మనుగడ సాగించిందని పేర్కొంటూ  అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ కష్ట సమయంలో స్టాలిన్‌ పార్టీని వదిలి టీవీకేతో చేతులు కలిపిందని ప్రధాని విమర్శించారు. అధికారంపై ఉన్న దురాశతో దొరికిన తొలి అవకాశంలోనే మిత్రుడికి వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు.  రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవడానికి కాంగ్రెస్‌ ఎంతటి దారుణానికి అయినా ఒడిగడుతుందని విమర్శించారు. డీఎంకేకు కాంగ్రెస్‌ పార్టీ చేసింది మిత్రద్రోహమని ధ్వజమెత్తారు.  

“ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న పరిస్థితిని ఒకసారి గమనించండి. 25- 30 ఏళ్ల పాటు కాంగ్రెస్, డీఎంకేతో సన్నిహిత సంబంధాలను పంచుకుంది. డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల పదే పదే కాంగ్రెస్‌ సంక్షోభాల నుంచి గట్టెక్కింది. నిజానికి 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ నడిపిన ప్రభుత్వం చాలావరకు డీఎంకే వల్లే నిలబడింది. అయినా, కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసిన అదే డీఎంకేకు ద్రోహం చేసింది. అధికార దురాశ, దాహంతో ఉన్న కాంగ్రెస్ దొరికిన తొలి అవకాశంలోనే డీఎంకేకు వెన్నుపోటు పొడిచింది” అంటూ విమర్శించారు.

బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీ కార్యకర్తల విజయమని అభివర్ణిస్తూ బెంగాల్​లో ఒకప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు 200కు పైగా సాధించామని తెలిపారు. అటు కేరళలో ఒకటి నుంచి మూడుకు ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకున్నామని, మెజారిటీ సాధించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. బీజేపీకి శక్తిని అందించే వాటిలో కర్ణాటక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏను రాజకీయ స్థిరత్వానికి, అభివృద్ధికి ప్రతిరూపంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ పాలనా నమూనాకు పెరుగుతున్న ప్రజా మద్దతును ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం చేశారు.  కర్ణాటకలోని అంతర్గత విభేధాల కారణంగా సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమైందని చెబుతూ గత మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి బదులుగా అంతర్గత కలహాలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ నేతలు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. 

సీఎం ఎంతకాలం కొనసాగుతారో, మరో వ్యక్తికి అవకాశం లభిస్తుందో లేదో కూడా కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించలేకపోతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ తిరిగి ఆధికారంలోకి రాదని, వారికి తెలిసిందల్లా కేవలం వెన్నుపోటు పొడవడం మాత్రమేనని ఆరోపించారు. సరైన ఎజెండా లేకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని ప్రధాని చెప్పారు. 
 
దేశప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ తగ్గిపోతుందని పేరొకొంటూ సురక్షిత పాలన, అభివృద్ధి కోసం దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని విమర్శించారు. అందుకే తాజా ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌, అస్సాం ప్రజలు కాషాయ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. భవిష్యత్తులో కర్ణాటకలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

కాగా, బెంగళూరులో ప్రధాని పాల్గొనే బీజేపీ బహిరంగ సభ వద్ద  ప్రధాని సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు మూడు కిలోమీటర్ల దూరంలోని కగలిపురలో రెండు జిలెటిన్‌ స్టిక్స్‌ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు నిర్వీర్వ దళాలు వాటిని అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు. 

ఆ జిలెటిన్‌ స్టిక్స్‌ను అక్కడ పెట్టినట్లు భావిస్తున్న ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దాంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రధాని మోదీ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు ఆయన కాన్వాయ్‌ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జిలెటిన్‌ స్టిక్స్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.