తమకు పరిపాలనా అనుమతి ఉందని పేర్కొంటూ కడప పట్టణంలోని ముస్లింలు అల్మాస్‌పేట్ సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్‌గా మార్చుతూ, అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసే పనులు ప్రారంభించడంతో శనివారం వివాదం చెలరేగింది. అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు హనుమాన్ సర్కిల్‌గా మార్చాలని పట్టుబట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
అదే సమయంలో అటువైపు వెళ్తున్న కొంతమంది హిందూ సంఘాల వారు హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ముస్లిములు స్టిక్కర్లు అంటించారంటూ బిజెపి నాయకులు బాలకృష్ణ యాదవ్, ఆ పార్టీ యువజన విభాగం నాయకులు బొమ్మన విజయ్, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, భజరంగదళ్, హిందూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. హనుమాన్ ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు.
టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు పనులు చేస్తున్నామని, వీటికి ఆటంకం కల్పించడం సరికాదంటూ ముస్లిములు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు ఆల్మాస్ పేట సర్కిల్లో ఆందోళనకు దిగారు. మండుటెండలో ఇరుగ్రూపుల బైఠాయింపు కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకుని వారి మధ్య సర్దుబాటుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
హిందూ, ముస్లిము గ్రూపులు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో కడప సిఐ నరసింహరాజు, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని లాఠీఛార్జి చేసి ఇరు గ్రూపులనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్మాస్ పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేశారు. కడప కార్పొరేషన్ పాలకవర్గం సైతం టిప్పుసుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు పనులు చేపట్టారు. టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు పుత్తా నరసింహారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు గ్రూపుల వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

More Stories
యూరియా, డిఎపి ఎరువుల వినియోగంపై నిఘా
పుట్టపర్తి యుద్ధ విమానాలతో మారనున్న రాయలసీమ తలరాత
దక్షిణ తీర రైల్వే జోన్ ఏపీ అభివృద్ధికి మైలురాయి