ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడలోని 2వ ఏజేఎస్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయికృష్ణది అదృశ్యం కేసు కాదని, పోలీసు కస్టడీలో జరిగిన మరణమని సిట్ స్పష్టం చేయడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా.. సీఐని నెల్లూరు జైలుకు సిట్ తరలించింది.
సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు మే 6న మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అక్కడ కస్టడీలో చిత్రహింసలవల్లే అతను మరణించాడని తెలిపింది. తన కొడుకు పోలీస్ స్టేషన్‌లో తీవ్రగాయాలతో, అపస్మారక స్థితిలో కనిపించాడని సాయికృష్ణ తల్లి చెప్పిన విషయాన్ని కూడా సిట్ ప్రస్తావించింది.
మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని, సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదని తెలిపింది. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని, ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టామని సిట్ రిపోర్టులో ప్రస్తావించింది. ఈ కేసులో 17 మంది సాక్షులను ప్రశ్నించామని, సాయికృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు ఎస్సై కూడా వాంగ్మూలం ఇచ్చారని సిట్ తెలిపింది.
లాకప్ డెత్‌ను కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయని సిట్ పేర్కొన్నది. మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేశారని నివేదికలో స్పష్టంచేసింది. అంతేకాకుండా సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని, దాన్ని ఖననం లేదా దహనం చేసేందుకు ప్రయత్నించారని సిట్ తెలిపింది. ఇప్పటికీ మృతదేహం లభ్యం కాలేదని పేర్కొన్నది.
సీఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే ఆధారాలను నాశనం చేసినట్టు తెలుస్తోందని సిట్ చెప్పింది. సీఐ నాగరాజు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తున్నారని సిట్ ఆరోపించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి, హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా రిపోర్టులో పేర్కొన్నారు.
సాయికృష్ణ మరణించాడని తెలిసినా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారాన్ని మెజిస్ట్రేట్‌కు చేరవేయలేదని సిట్ పేర్కొంది. సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళితే సీఐ నాగరాజు దూషించారని, సాక్ష్యాలు నాశనం కావడానికి ఆయన కారణమని పేర్కొంటూ హైకోర్టు ముందు నిజాలు దాచారని, కోర్టును తప్పుదోవ పట్టించారని సిట్ తెలిపింది. కాగా సోమవారం 5 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసు చాలా సంక్లిష్టంగా ఉందని, దర్యాప్తునకు మరింత సమయం అవసరమని సిట్ కోర్టుకు విన్నవించింది. కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీస్ శాఖ ఇప్పటికే సీఐ నాగరాజును విధుల నుంచి సస్పెండ్ చేసింది.
మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీస్ ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగేలా చర్యలు తీసుకున్నామని, ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ఏజీ వాదనల్ని విన్న కోర్టు ఏం చేస్తారో వేచి చూద్దామంటూ ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.
More Stories
ఫోరెన్సిక్ రిపోర్టునే ఫోర్జరీ చేసిన సీఎం మాన్‌ను అరెస్ట్ చేయండి
ఉగ్రవాదం, సైబర్ ముప్పులపై బ్రిక్స్ ఉక్కుపాదం మోపాలి
ఎఫ్సీఆర్ఏ కోసం ఎన్జీఓలు ఉద్దేశ్యం, కార్యరంగాలను ప్రకటించాలి