* బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో ప్రధాని మోదీ
మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఉగ్రవాదం, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో ఏర్పడుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులతో
ఉగ్రవాదం సహా సైబర్ దాడులు, ఇతర అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూ ఢిల్లీ వేదికగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అధ్యక్షతన జరిగిన ’16వ బ్రిక్స్ ఎన్ఎస్ఏ సమావేశం’ విజయవంతమైంది. ఈ సదస్సుకు హాజరైన బ్రిక్స్ సభ్యదేశాల ఎన్ఎస్ఏలు, ఉన్నత స్థాయి భద్రతా అధికారుల బృందం ఆ తర్వాత మోదీతో సమావేశమైంది. ఈ సందర్భంగానే పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
2026లో బ్రిక్స్ కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. గతంలో 2012, 2016, 2021లలో కూడా అధ్యక్షత వహించగా ఇది నాలుగోసారి. ఈ సంవత్సరం భారత నాయకత్వంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలకు పూర్తి మద్దతు ఇవ్వడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని మోదీ చెప్పారు. మరింత సురక్షితమైన, సమగ్రమైన ప్రపంచ నిర్మాణానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన అసాంప్రదాయ సవాళ్లలో ఇంధన భద్రత, ఆహార భద్రత, సరఫరా గొలుసు అంతరాయాలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే అస్థిరతలను గుర్తిస్తూ, ఉగ్రవాదం, సైబర్ ముప్పులకు వ్యతిరేకంగా మరింత లోతైన సహకారం కోసం పిలుపునిచ్చారు.
ఒక అధికారిక ప్రకటన ప్రకారం, ఇంధన, ఆహార భద్రత, సరఫరా గొలుసు స్థితిస్థాపకత, సైబర్ భద్రత, వాతావరణ మార్పుల వల్ల కలిగే అస్థిరత, ఉగ్రవాద నెట్‌వర్క్‌ల ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వినియోగానికి సంబంధించిన సవాళ్లపై పాల్గొన్నవారు చర్చించారు. ఉగ్రవాదం, సైబర్ ప్రమాదాలను సమిష్టిగా ఎదుర్కోవడానికి సామర్థ్య నిర్మాణం, మెరుగైన సమాచార మార్పిడి, చట్ట అమలు సంస్థల మధ్య అధిక సమన్వయం ద్వారా బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడానికి నాయకులు మద్దతు తెలిపారు.
సదస్సుకు నేతృత్వం వహించిన భారత ఎన్ఎస్ఏ అజితే డోభాల్ బ్రిక్స్ అనేది ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన, ప్రత్యేకమైన కూటమి అని అభివర్ణించారు. ప్రస్తుతం ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన వేదికగా ఎదిగిందని తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రపంచ రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవస్థల్లో మరింత కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్నాయని చెప్పారు.
ఈ బ్రిక్స్ ఉన్నత స్థాయి సదస్సులో బ్రిక్స్ కూటమిలోని 11 ప్రధాన సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, దక్షిణాఫ్రికా మంత్రి ఖుంబుజో, యూఏఈ జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యదర్శి అలీ మొహ్మద్ అల్ షంసీ, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగూతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా,బ్రెజిల్, ఇరాన్, ఇండోనేసియా దేశాలకు చెందిన అత్యున్నత రక్షణ, భద్రతా అధికారులు హాజరయ్యారు.

More Stories
9వ తరగతి పాఠ్యపుస్తకంలో ఎమర్జెన్సీని చేర్చిన ఎన్సీఈఆర్టీ
కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో భూకబ్జాకు పాల్పడ్డ ఖర్గేలు
ఆంధ్ర ప్రాంత సంచాలిక డాక్టర్. డి సోమేశ్వరి