ఎఫ్‌సీఆర్‌ఏ కోసం ఎన్జీఓలు ఉద్దేశ్యం, కార్యరంగాలను ప్రకటించాలి

ఎఫ్‌సీఆర్‌ఏ కోసం ఎన్జీఓలు ఉద్దేశ్యం, కార్యరంగాలను ప్రకటించాలి
* ఎన్జీఓల కార్యనిర్వాహకవర్గంలో విదేశీయులు ఉండరాదు 
 
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీఓలు) విదేశీ నిధులను స్వీకరించేందుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ సవరణల ప్రకారం, ప్రభుత్వేతర సంస్థలు ముందుగా నిర్దేశించిన ప్రయోజనాల జాబితా నుండి ఒకదాన్ని ఎంచుకోవాలి. తాము ఏ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తాయో పేర్కొనాలి. 
 
ఈ మార్పులు పలు మతపరమైన కార్యకలాపాలకు కూడా అనుమతినిస్తున్నాయి. అయితే, రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉన్న అనేక వర్గాల నుండి మత ప్రచారం మినహాయించిన్నల్టు స్పష్టంగా పేర్కొన్నాయి. సోమవారం జారీ చేసిన ఒక గెజిట్ నోటిఫికేషన్‌లో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, భారతీయ సంతతికి చెందిన వారు కాకుండా ఇతర విదేశీయులు కీలక కార్యకర్తలుగా ఉన్న సంఘాలను,  ఎఫ్‌సీఆర్‌ఏ  కింద విదేశీ నిధులు స్వీకరించడానికి రిజిస్ట్రేషన్ లేదా ముందస్తు అనుమతి కోసం “సాధారణంగా పరిగణించబోమని” కూడా తెలిపింది. 
 
అదే సమయంలో, అటువంటి కేసులను ప్రత్యేక ఉత్తర్వు ద్వారా అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఒక నిబంధనను కూడా పొందుపరిచింది. భారతదేశంలోని ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలు విదేశీ నిధులను స్వీకరించే, ఉపయోగించే విధానంలో జవాబుదారీతనాన్ని కఠినతరం చేయడమే  ఎఫ్‌సీఆర్‌ఏ  నియమాలు, 2011కు చేసిన సవరణల లక్ష్యమని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ నిబంధనలు, వ్యక్తులతో పాటు ఇతర సంస్థలకు కూడా “కీలక కార్యనిర్వాహకుడు” అనే పదానికి విస్తృత అర్థాన్ని ఇచ్చాయి. ఇందులో కంపెనీ డైరెక్టర్లు, సంస్థలలోని భాగస్వాములు, ట్రస్టీలు, హిందూ అవిభక్త కుటుంబ కర్త, సంఘం నిర్వహణపై నియంత్రణ కలిగిన ఏ వ్యక్తి అయినా చేర్చారు. కొత్త నిబంధనల ప్రకారం, విదేశీ నిధులు స్వీకరించడానికి రిజిస్ట్రేషన్ కోరుకునే ఎన్జీఓలు, తాము ఏ ఖచ్చితమైన ప్రయోజనం కోసం దరఖాస్తు చేస్తున్నారో, ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో తమ కార్యకలాపాలను నిర్వహించాలనుకుంటున్నారో తప్పనిసరిగా పేర్కొనాలి.
 
 “రిజిస్ట్రేషన్ కోసం చేసే ప్రతి దరఖాస్తులో, ఈ నిబంధనలకు జతచేసిన షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రయోజనాల జాబితా నుండి మాత్రమే ఎంచుకున్న, రిజిస్ట్రేషన్ కోరిన ప్రయోజనం లేదా ప్రయోజనాలను, సంఘం ఏ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యకలాపాలను చేపట్టాలనుకుంటుందో ఆ వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి,” అని నోటిఫికేషన్ తెలిపింది.
 
ఈ వివరాలు ఎన్జీఓకు జారీ చేసే సర్టిఫికేట్‌లో పేర్కొంటామని కూడా అది పేర్కొంది. దరఖాస్తుదారులు ఇప్పుడు మతపరమైన, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, సామాజిక ప్రయోజనాలను కవర్ చేసే నిబంధనలలోని షెడ్యూల్ నుండి కార్యకలాపాలను ఎంచుకోవలసి ఉంటుంది. మతపరమైన ప్రయోజనాల కింద, జాబితా చేసిన కార్యకలాపాలలో మతపరమైన ప్రదేశాల నిర్మాణం, పునరుద్ధరణ, నిర్వహణ, మత విద్య, భక్తి సంగీత ప్రచారం మొదలైనవి ఉన్నాయి.
 
అయితే, మత విద్య, విశ్వాస సంప్రదాయాల నమోదు, స్థానిక నమ్మకాల పరిరక్షణ వంటివి ‘మత మార్పిడికి తావులేకుండా’ నిర్వహించాలని నియమాలు పేర్కొంటున్నాయి.  “దేశీయ, గిరిజన విశ్వాస పద్ధతులు, ఆచారాలు, ఆరాధనా విధానాల నమోదు, పరిరక్షణ, పునరుద్ధరణ”, “మత విద్య, నైతిక బోధన, సత్సంగాలు, ప్రసంగాలు, ధ్యాన శిబిరాల నిర్వహణ”కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. 
 
2026కు ముందు నమోదైన అన్ని సంఘాలకు, తమ రిజిస్ట్రేషన్‌లో తాము ఏ నిర్దిష్ట ప్రయోజనాలను, రాష్ట్రాలను కొనసాగించాలనుకుంటున్నారో ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది. సవరించిన నిబంధనలు ఒక రుసుము విధానాన్ని కూడా ప్రవేశపెట్టాయి, దీని ప్రకారం దరఖాస్తుకు జోడించిన ప్రతి అదనపు రాష్ట్రం లేదా ప్రయోజనానికి రూ. 300 అదనంగా వసూలు చేస్తారు. 
 
నిష్క్రియంగా ఉన్న ఎన్జీఓలు లైసెన్సులను నిలుపుకోకుండా నిరోధించడానికి, ప్రభుత్వం గత రెండు ఆర్థిక సంవత్సరాలలో ఎంచుకున్న కార్యకలాపాలపై విదేశీ విరాళాల రూపంలో కనీసం రూ. 10 లక్షలు ఖర్చు చేయాలనే నిబంధనను ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవడానికి లేదా రద్దును నివారించడానికి, ఒక ఎన్జీఓ ఆ కాలంలో తాను ఎంచుకున్న కార్యకలాపాలపై ఆ మొత్తాన్ని ఖర్చు చేసి ఉండాలి. 
 
ముందస్తు అనుమతితో ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం విదేశీ నిధులను స్వీకరించే ఎన్జీఓలకు, మునుపటి విడత నిధులలో కనీసం 75 శాతం వినియోగించిన తర్వాతే రెండవ లేదా ఆ తర్వాతి విడతను విడుదల చేస్తారు. అంతేకాకుండా, ఆ నిధుల వినియోగాన్ని ధృవీకరించడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయి విచారణను నిర్వహిస్తుంది. 
 
సవరించిన నిబంధనల ప్రకారం, విదేశీ నిధులను స్వీకరించే ఎన్జీఓలు ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదు లేదా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అందించాలి. నిధులు మధ్యవర్తి చెల్లింపు సాధనాలు లేదా దాతల సలహా మేరకు నిధుల (డోనర్ అడ్వైజ్డ్ ఫండ్స్) ద్వారా వస్తే, ఆ ఎన్జీఓ తన దరఖాస్తులో అంతిమ దాతను లేదా డబ్బు యొక్క అసలు మూలాన్ని తప్పనిసరిగా వెల్లడించాలి. 
 
వార్షిక రిటర్నులలో ఇకపై ఆర్థిక నివేదికలతో పాటు వివరణాత్మక కార్యకలాపాల నివేదికను కూడా చేర్చాల్సి ఉంటుంది. వార్తలు లేదా సమకాలీన విషయాలను రూపొందించడం లేదా ప్రసారం చేయడంపై నిషేధం ఉన్నందున, తాము గానీ లేదా తమ కీలక కార్యకర్తలు గానీ ఏవైనా పుస్తకాలు లేదా వ్యాసాలు ప్రచురించారా అనే విషయాన్ని కూడా ఎన్జీఓలు తప్పనిసరిగా ప్రకటించాలి. మొత్తంమీద, ఈ మార్పుల ప్రకారం ఎన్జీఓలు తమ ఉద్దేశ్యాన్ని, పని చేసే రంగాన్ని మరింత స్పష్టంగా నిర్వచించుకోవాలి. విదేశీ నిధుల స్వీకరణ, వినియోగంపై అదనపు షరతులను విధించాలి.