భారతీయ జనతా పార్టీ ఏపీలో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదుల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో కల్తీ ఆహారం, ఆహార భద్రత సంక్షోభంలు నెలకొన్నాయి. ప్రజలు తీసుకునే ఆహారం సురక్షితం కాకపోతే, అది కేవలం ఆరోగ్యానికే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వైద్య ఖర్చులు పెరిగి, సాధారణ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ పాలు, నకిలీ మసాలాలు, నాసిరకం ప్యాకేజ్డ్ ఫుడ్, అపరిశుభ్ర మాంసం విక్రయాలు, నాణ్యతలేని ప్యాకేజ్డ్ వాటర్ వంటి సమస్యలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇవి ప్రజారోగ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఆహార భద్రత అమలులో సిబ్బంది కొరత కూడా తీవ్రమైన సమస్యగా ఉంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం రాష్ట్రానికి అవసరమైన ఆహార భద్రతా అధికారుల సంఖ్యతో పోలిస్తే భారీ కొరత ఉంది.
మొత్తం 723 పోస్టులు మంజూరై ఉండగా, కేవలం 144 మంది మాత్రమే విధుల్లో ఉండటం, 500కు పైగా పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళనకరం. 2023–2026 మధ్య పరీక్షించిన 16,700 ఫుడ్ శాంపిల్స్‌లో సుమారు 1,400 కల్తీ నమూనాలు గుర్తించబడినట్లు సమాచారం. ఇది సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తుంది.
ఇటీవలి సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కుదిపేసిన కొన్ని ప్రధాన సంఘటనలు రాజమహేంద్రవరం కల్తీ పాలు ఘటనలో కలుషిత పాలు సేవించడం వల్ల పలువురు మృతి చెందారు. పాలలో ప్రమాదకర రసాయనాల అనుమానం వెలుగులోకి వచ్చింది. ఏలూరులో కలుషిత నీటి కారణంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళంలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా, గ్యాస్ట్రో కేసులు పెరిగాయి.
తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ దర్యాప్తులో కల్తీ నెయ్యి సరఫరాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో పాడైన మాంసం వినియోగం రాకెట్లు వెల్లడయ్యాయి. అనకాపల్లిలో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత ప్రభుత్వం ఆహార నాణ్యత పరిరక్షణ విభాగాన్ని విస్మరించిన కారణంగా దాని ఫలితాలు చూస్తున్నామని బిజెపి నాయకులు వాపోతున్నారు.
పాలలో డిటర్జెంట్, స్టార్చ్, యూరియా కలపడం, ప్యాకేజ్డ్ వాటర్‌లో బ్యాక్టీరియా కాలుష్యం, గడువు ముగిసిన ప్యాకేజీ చేసిన ఆహార పదార్థాల రీలేబలింగ్, కోల్డ్ స్టోరేజ్ లేకుండా మాంసం విక్రయం, స్వీట్లు, వీధి ఆహారంలలో రసాయనిక రంగుల వినియోగం, వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం, డ్రైనేజ్ పక్కన వంటలు, అపరిశుభ్ర వంటగదుల నిర్వహణ వంటి సమస్యలు పలు జిల్లాల నుండి వస్తున్నాయి.
మాంసం దుకాణాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది. పట్టణాలు, గ్రామాల్లో అనేక దుకాణాలు లైసెన్స్ లేకుండా నడుస్తున్నాయి. బహిరంగంగా మాంసం వేలాడదీయడం, ఈగలు, దుమ్ము, కలుషిత నీటి వినియోగం, వ్యర్థాల నిర్వహణ లోపం, కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, అక్రమ జంతు వధ కేంద్రాలు పెరగడం వంటి పరిస్థితులు పలు వ్యాధులకు దారితీస్తున్నాయి.
ఫుడ్ టెస్టింగ్ మౌలిక వసతులు కూడా అవసరానికి తగిన స్థాయిలో లేవు. జిల్లాల వారీగా ల్యాబ్‌లు లేకపోవడం వల్ల నమూనాల సేకరణ పరిమితమవుతోంది. పరీక్షా నివేదికలు ఆలస్యమవుతున్నాయి. అనేక సందర్భాల్లో ప్రక్క రాష్ట్రాల ల్యాబ్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విశాఖపట్నంలో రూ.4.77 కోట్లతో నిర్మించిన రాష్ట్ర ఆహార ప్రయోగశాల కూడా సిబ్బంది కొరత వల్ల పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. జెఎన్ టియు కాకినాడ, టిటిడిలతో పాటు కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవసరాలకు అవి సరిపోవడం లేదు.
అందుకనే జిల్లాల్లో ఆహార భద్రతా అధికారుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ప్రతి జిల్లాలో కనీసం ఒక మినీ ఆహార టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని, అన్ని ఆహార వ్యాపార సంస్థల్లో క్యూఆర్ ఆధారిత ఫుడ్ లైసెన్స్ లను ప్రదర్శించడం తప్పనిసరి చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాల్లో వారానికొకసారి పరిశుభ్రత తనిఖీలు నిర్వహించాలని, అక్రమ వధశాలలను గుర్తించి తక్షణమే మూసివేయాలని కోరింది.
ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్, ప్రభుత్వ పాటశాలలు, అంగన్ వాడి కేంద్రాలలో ప్రత్యేక ఆహార భద్రత తనిఖీలు నిర్వహించాలని, ప్రజల ఫిర్యాదుల కోసం 24×7 ఆహార భద్రతా హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.
More Stories
మెట్రో రైల్ ఫేజ్ -2పై రైల్వే మంత్రితో రేవంత్, కిషన్ భేటీ
ఇంగ్లాండ్ లో పదేళ్లలో ఆరుగురు ప్రధానులు రాజీనామా
లక్నో కోచింగ్ సెంటర్ అగ్నిప్రమాదంలో 15 మంది దుర్మరణం