సోమవారం మధ్యాహ్నం ఉత్తర లక్నోలోని ఒక నివాస ప్రాంతంలో ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో, విద్యార్థులతో సహా కనీసం 15 మంది మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న ఈ భవనంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి, లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి, హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్ వాహనంతో సహా మొత్తం 14 ఫైర్ టెండర్లను రంగంలోకి దించారు. మంటలు వేగంగా భవనాన్ని చుట్టుముడుతుండగా, ప్రాణభయంతో విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు ఘటనా స్థలం నుండి వెలువడిన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి.
ఈ భవనంలో పెంపుడు జంతువుల క్లినిక్‌తో పాటు విద్యార్థుల కోసం ఒక విద్యా కేంద్రం కూడా ఉంది. కోచింగ్ సెంటర్లు, కేఫ్‌లతో సహా వాణిజ్య సముదాయాలు అధికంగా ఉన్న, పురానియా మార్కెట్‌కు నడక దూరంలో ఉన్న అలీగంజ్ అనే ఉన్నత శ్రేణి నివాస ప్రాంతంలో ఈ భవనం ఉంది. 15మంది మృతికి భవన యజమానుల నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారు భవన ఉమ్మడి యజమానులని అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు, ఇతరులపై సామూహిక హత్య తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈలోగా, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అలీగఢ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని లక్నోకు తిరిగి వచ్చారు బాధిత కుటుంబాలను తక్షణమే సంప్రదించి, సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ బృందంలో పర్యాటక, మతపరమైన వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజాత్ ఒక సభ్యుడిగా ఉన్నారు. లక్నో జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ మరో సభ్యుడు.
అంతేకాకుండా, ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య చికిత్స అందేలా చూడాలని ఆయన సూచించారు. “లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగడం అత్యంత విషాదకరం, హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను,” అని ఆయన తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. కోచింగ్ సెంటర్‌లో దట్టమైన పొగ కమ్ముకున్నదని, రూముల్లో ఉన్న ప్రతి ఐటమ్‌ను తొలగిస్తూ, అన్ని ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ తెలిపారు. కోచింగ్ సెంటర్‌లో ఎక్కువ శాతం వుడెన్ ఫర్నీచర్ ఉన్నట్లు చెప్పారు.
కోచింగ్ సెంటర్‌లో యానిమేషన్ శిక్షణ ఇస్తారని, యానిమేషన్ కోర్సు నేర్చుకునేందుకు ఈ సెంటర్‌కు పిల్లలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వయసు వారేనని అధికారులు తెలిపారు. భవనం గోడలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించారు. ప్రమాదానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

More Stories
త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు..ఉదయనిధి అరెస్ట్, హైకోర్టులో బెయిల్
‘జెన్ జెడ్’, ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులతో 6న డా. భగవత్ భేటీ
కర్ణాటక కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్తరణ కలకలం