ఇండి కూటమి త్వరలో కుప్పకూలిపోతుంది

ఇండి కూటమి త్వరలో కుప్పకూలిపోతుంది
* మిత్రపక్షాలకు వెన్నుపోటు కాంగ్రెస్ చరిత్ర 
తమిళనాడు ఎన్నికలలో ఓటమి చెందగానే డీఎంకేను వదిలి, అధికారం కోసం గెలుపొందిన వీటికేకు మద్దతు ప్రకటించడంపై స్పందిస్తూ మిత్రపక్షాలను వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్ చరిత్రలోనే ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ధ్వజమెత్తారు. అదేసమయంలో ప్రతిపక్ష ఇండియా త్వరలో కుప్పకూలిపోతుందని, దానికి ఎటువంటి ఉమ్మడి సిద్ధాంతం, దార్శనికత లేదని స్పష్టం చేశారు. 
“ప్రతిపక్ష కూటమి కేవలం రాజకీయ అనివార్యతలు, వ్యక్తిగత ఆశయాల కోసమే ఏర్పడింది. ఇండి కూటమికి ఎప్పుడూ ఎటువంటి లక్ష్యం గానీ, దార్శనికత గానీ లేవు. కేవలం పదవీకాంక్ష, అవినీతి, కమీషన్లు, మోదీపై ద్వేషం అనే అంశాల ఆధారంగానే వారు ఒక్కటయ్యారు. కానీ త్వరలో అదంతా కుప్పకూలిపోతుంది” అని జోస్యం చెప్పారు. అదేవిధంగా, మే 4 వెలువడిన అసెంబ్లీ ఫలితాలను చూస్తే ఇండి కూటమి ముగిసిపోయినట్లే ఉందని షెహజాద్ పూనావాలా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ మోసం చేయని వారు అంటూ ఎవరూ లేరని, డీఎంకేకే వారు ఇలా చేశారంటే, ఇక సమాజ్‌వాదీ పార్టీకి ఏం చేస్తారో ఒక్కసారి ఊహించండని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే, ఇండి కూటమికి ఇవే అంత్యక్రియలని అభివర్ణించారు. 

ఈ సందర్భంగా పూనావాలా ఒక వీడియో సందేశంలో ఇలా పేర్కొన్నారు: “ఇప్పుడు విపక్ష కూటమి డీఎంకే, టీఎంసీ, వామపక్షాలు లేని ఇండి కూటమిగా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ డీఎంకేని వదిలేసి టీవికెని పట్టుకుంది. చాలా రాష్ట్రాల్లో ఆ కూటమి జాడ కూడా లేదు. బంగాల్‌, కేరళ, గుజరాత్‌, పంజాబ్‌లో, డిల్లీ, హరియాణా, కర్ణాటకలో అసలు ఇండి కూటమి ఎక్కడ ఉంది?” అని ఆయన ప్రశ్నించారు.