వారాంతపు విరామం తర్వాత సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్లు జోషందుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో నమోదైన లాభాలు, అలాగే ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం దేశీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి. ఇదే సమయంలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ కూడా మార్కెట్ దిశను ప్రభావితం చేస్తున్నాయి.
సోమవారం ఉదయం ప్రారంభ వాణిజ్యంలోనే సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 745 పాయింట్లు ఎగబాకి 77,656 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 220 పాయింట్లకుపైగా లాభంతో 24,215 పాయింట్లకు పైస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా అనిశ్చితిలో ఉన్న మార్కెట్లు నేడు ఫలితాల సరళి స్పష్టంగా ఉండటంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి.
ప్రధానంగా బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగ షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుండటంతో మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల అనుకూల విధానాలు వస్తాయనే ఆశతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
రంగాల వారీగా చూస్తే ఆటోమొబైల్ షేర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బజాజ్ ఆటో షేర్ బైబ్యాక్‌పై ఆలోచిస్తున్నట్టు వచ్చిన సమాచారం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ వంటి ప్రముఖ కంపెనీలు గెయినర్ల జాబితాలో నిలిచాయి. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.7% నుంచి 0.9% వరకు పెరగడం మార్కెట్‌లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయని సూచిస్తోంది.
ఇంకా రియల్ ఎస్టేట్, మెటల్ రంగాల్లో మంచి డిమాండ్ కనిపిస్తుండగా, ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రైల్వే, డిఫెన్స్, పవర్ గ్రిడ్ వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం పెరుగుతుందనే అంచనాలు మార్కెట్‌కు బూస్ట్‌ను ఇచ్చాయి. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీయే పట్టు నిలుపుకోవడం కూడా స్థిరత్వానికి చిహ్నంగా మార్కెట్ భావిస్తోంది. మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్‌తో ఇన్వెస్టర్ల సంపద కేవలం కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలు పెరిగింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం భారత్‌కు అనుకూల పరిణామంగా మారింది. అమెరికా ప్రకటించిన సముద్ర భద్రత చర్యలు హార్మూజ్ జలసంధిలో సరఫరాపై ఉన్న ఆందోళనలను తగ్గించాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 108 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. ఇక రాజకీయంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చిన కొద్దీ మార్కెట్‌లో మరింత చురుకుదనం లేదా మార్పులు కనిపించే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు ప్రస్తుతం కంపెనీల త్రైమాసిక ఫలితాలతో పాటు రాజకీయ పరిస్థితులపైనా దృష్టి పెట్టారు.

More Stories
21కి చేరిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు
మమతను ఓడించిన బిజెపి… గెలుపొందిన అధికార పార్టీ బిజెపినే!
ప్రపంచంలోనే తొలి ఆప్ స్టార్ ఉపగ్రహం “మిషన్ దృష్టి” ప్రయోగం