చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల అభివృద్ధికి ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమిని సేకరించి రాష్ట్ర ప్రభుత్వం సత్వరం కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ వ్రాసారు. చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టర్మినల్ ను ప్రారంభించుకున్న తరువాత రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, దీనికి అనుగుణంగా రైల్వేస్టేషన్ కు వెలుపల ఇరువైపులా ప్రయాణికులు, వాహనాలు రైల్వేస్టేషన్ కు సులభంగా రాకపోకలు సాగించటానికి వీలుగా అప్రోచ్ రోడ్లను విస్తరించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
అలాగే, పార్కింగ్ తదితర అవసరాల కోసం స్టేషన్ కు ఇరువైపులా అవసరమైన భూసేకరణ పూర్తి చేయవలసి ఉందని పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ కు నీటి సరఫరా కనెక్షన్ ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం రూ.4 కోట్ల నిధులను కూడా రైల్వే శాఖ జమ చేసిందని చెబుతూ ఈ నీటి కనెక్షన్ ను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కోరారు. వీటితో పాటుగా, భవిష్యత్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రూ. 715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను పునరాభివృద్ధి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్ ను చేరుకోవడానికి ఇప్పుడు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉందని, ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఆల్ఫా హోటల్ నుండి రాటిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అధికారుల బృందం రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్లను పరిశీలించి చర్యలకు ఉపక్రమించినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి ఫలితం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
కావున, ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ చూపించి, నగరానికి ఎంతో అవసరమైన చర్లపల్లి రైల్వేస్టేషన్ కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయింపు జరపాలని కోరారు. అదేవిధంగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
More Stories
రెండేళ్లలో తెలంగాణ ఐటీ రంగంలో రెండు లక్షల ఉద్యోగులకు ముప్పు!
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం
తెలంగాణలో స్వీయగణన నమోదుకు అవకాశం