ఆంధ్రా యూనివర్సిటీ గ్లోబల్ యూనివర్సిటీగా ఎదగాలి 

ఆంధ్రా యూనివర్సిటీ గ్లోబల్ యూనివర్సిటీగా ఎదగాలి 
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ విద్యా పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని భారత ఉప రాష్ట్రపతి సిపి.రాధాకృష్ణన్‌ ఆకాంక్షించారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో సోమవారం ఎయు శతాబ్ది ముగింపు వేడుకలు సందడిగా సాగాయి. 
 
సభా వేదికపై ఉపరాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ డా. కె హరిబాబు, భారతీయ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్‌, సంధ్యారాణి, ఎంపి శ్రీభరత్‌, ఎయు వైస్‌ ఛాన్సలర్‌ రాజశేఖర్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆశీనులయ్యారు. 
 
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే వరకూ ఓపిగ్గా ఉండాలని చెప్పారు. సచిన్‌ టెండూల్కర్‌ వందో సెంచరీ కోసం పడ్డ శ్రమను గుర్తుచేసుకోవాలని సూచించారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మేధస్సు, నైతిక విలువలు భారత విద్యా వ్యవస్థకే వన్నె తెచ్చాయని, నోబెల్‌ బహుమతి గ్రహీత సర్‌ సివి.రామన్‌ వంటి దిగ్గజాలు ఎయులో చదువుకోవడం గర్వకారణమని కొనియాడారు. 
 
2047 నాటికి వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమేనని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఏపీకి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని చెబుతూ మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని వివరించారు. అంతర్గత ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధ్యమని పేర్కొంటూ సమస్యలు వచ్చినప్పుడే మన ప్రతిభ, సామర్థ్యం చూపించాలని పిలుపునిచ్చారు. యువత కృషితోనే వికసిత్ భారత్ సాధ్యమని స్పష్టం చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల పండగ ఒక చరిత్ర అని, స్వాతంత్య్రానికి ముందే ఈ యూనివర్సిటీ ఏర్పాటు కావడం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు తెలిపారు. ఎయు అభివృద్ధికి రూ.500 కోట్లను పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీలో చదువుకుని పెద్దోళ్లయిన వ్యాపారులు ‘కార్పస్‌’ ఫండ్‌గా సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని ప్రభావితం చేసే నూతన ఆవిష్కరణలకు ఎయు వేదిక కావాలని ఆకాక్షించారు.

ఆంధ్రా విశ్వ కళాపరిషత్‌ను విద్యా సంస్థ అనేకంటే తెలుగు జాతి గర్వించే సాంస్కృతిక, వారసత్వ సంపద అనడం ఉత్తమమని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. సిఆర్‌.రెడ్డి, సివి.రామన్‌, రవీంద్రనాథ్‌ టాగూర్‌ వంటి మహనీయుల అడుగుజాడలు ఈ సంస్థ కీర్తిని విశ్వవ్యాప్తం చేశాయని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.