నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకే కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపుపై ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బుధవారం నుంచి సమ్మె చేపడుతున్నామని, సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని తెలిపారు.
ఇప్పటివరకూ ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని, కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని అడుగుతున్నా పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టి మరీ ప్రభుత్వం విస్మరించిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ధ్వజమెత్తారు. ఈ నెల 22వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని ప్రకటించిన నేపధ్యంలో 21వ తేదీ లోపు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేందుకు అంగీకరించకపోతే సమ్మె విషయంలో వెనకడుగు వేసేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.
మరో సకల జనుల సమ్మెలాగా కార్యరూపం దాల్చుతుందన, ప్రైవేట్ సిబ్బందితో తమ సమ్మె నిర్వీర్యం చేయాలని చూస్తే ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసు అంటూ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హెచ్చరించారు. అయితే, సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం నుంచిగానీ, ఆర్టీసీ అధికారుల నుంచి గానీ చర్చలకు పిలుపు రాలేదు. ఆర్టీసీలో అధికారికంగా కార్మిక సంఘాలు లేనందున చర్చలకు సిద్ధం కాలేదు. కార్మిక సంఘాలకు నేతృత్వం వహిస్తున్న నేతల్లో ఇద్దరుముగ్గురు తప్ప మిగతా అంతా ఉద్యోగ విరమణ చేసిన వారే. దీనిని కూడా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి వరకు సమ్మె విషయంలో స్పందించలేదు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎలాంటి నిర్ణయం తెలపలేని పరిస్థితి నెలకొంది. మంగళవారం వేతన సవరణ సహా కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయటం ద్వారా కార్మికులను ఒప్పించి సమ్మెకు దిగకుండా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ చేయాలనే డిమాండ్‌తో రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీతో జరిపిన చర్చల్లో ఎలాంటి ఫలితం లేనందున ఈ నెల 22 నుంచి తలపెట్టిన సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హనుమంత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు తెలిపారు. సోమవారం విద్యానగర్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేనందున సమ్మెలో భాగస్వాములం అవుతున్నామని వెల్లడించారు.

More Stories
హరీష్ రావు హస్తిన పర్యటనపై రాజకీయ దుమారం!
కాళేశ్వరంపై సీబీఐ విచారణలో అడుగు ముందుకు
మహాత్మా బసవేశ్వరునికి బిజెపి నివాళులు