కాళేశ్వరంపై సీబీఐ విచారణలో అడుగు ముందుకు

కాళేశ్వరంపై సీబీఐ విచారణలో అడుగు ముందుకు
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పరిస్థితిపై సమీక్షించామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాళేశ్వరంపై సీబీఐ విచారణ విషయంలో అడుగు ముందుకు పడుతోందని తెలిపారు. సీబీఐ విచారణలో కదలిక వచ్చిందని తెలిసి కాళేశ్వరంపై సీబీఐ విచారణను అడ్డుకునేందుకే ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 
 
మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపటం ప్రమాదకరమని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని, ఘోర తప్పిదాలు జరిగాయని జస్టీస్ పీసీ ఘోష్‌ జ్యుడీషియల్ కమిషన్‌ కూడా చెప్పిందని పేర్కొంటూ నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ చేసి కేసును సీబీఐ విచారణకు అప్పగించామని గుర్తు చేశారు. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని పేర్కొంటూ అయితే దాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. 
 
కాని ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగా కుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందని రేవంత్ రెడ్డి తెలిపారు.  ప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని కేసీఆర్‌ భావించి పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని సీఎం విమర్శించారు. రూ.34 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజినీర్లు చెప్పారని గుర్తు చేశారు.
ఇంజినీర్ల లేఖలను సీఎం, ఎల్‌ అండ్‌ డీ సంస్థ పట్టించుకోలేదని ఆరోపించారు.  ఇక కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును తాము అలాగే వదిలేయలేమని, దాని పునరుద్ధరణపై తాము చిత్తశుద్ధితో ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టు ను ఊరికే వదిలిపెట్టబోమని, దానికి మరమ్మతులు చేసి ప్రజలకు నీరు అందిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఇందుకు సంబంధించి నెల రోజుల క్రితమే అధికారుల తో, సాంకేతిక నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామని పేర్కొంటూ ప్రాజెక్టు పునరుద్ధరణపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  తాము ఇప్పటికే సాంకేతిక నిపుణులు, మూడు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించామని, శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు మొదలుపెట్టామని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 
లోపాలపై ఎలా ముందుకెళ్లాలో ఒక స్పష్టత వచ్చిందని, ఇకనుంచి జరిగే ప్రతీ పనిలో ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని, ప్రతీ పనిలో ఎన్డీఎస్ఏ అనుమతి తీసుకుని పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వా రా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి విమర్శించారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు.