వివాదాలకు నిలయంగా కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ

వివాదాలకు నిలయంగా కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్యకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిత్యం వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. నిన్న జరిగిన ఫైనల్ ఎంబిబిఎస్ జనరల్ సర్జరీ  పేపర్-1 ఎగ్జామ్ ను టెక్నికల్ రీజన్స్ తో రద్దు చేస్తున్నట్లు, తిరిగి ఈ నెల 27న పరీక్షను మళ్ళీ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు.
 
దీనికి ప్రధాన కారణం పరీక్షల నియంత్రణ అధికారి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్ పర్సన్ నిర్లక్ష్యం కారణంగా పరీక్ష పత్రంలో తప్పదొర్లడమే అని ఆయన విమర్శించారు. పరీక్షను రద్దు చేసిన కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంటూ ఇంకెన్నాళ్ళు మీరు చేస్తున్న తప్పులకు మేం శిక్షను అనుభవించాలని వాపోతున్నారని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
 
మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే రాసే స్థితిలో లేమని, ఇలాంటి వాటివల్ల ముందు రాసే పరీక్షలపై ఫోకస్ చేయలేకపోతున్నట్లు విద్యార్థులు వాపోతున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు యూనివర్సిటీలో కొత్తేమీ కాదని చెబుతూ గతంలో పాత ప్రశ్నా పత్రంతోనే పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారుల తీరు మారట్లేదని ఎబివిపి నేత విచారం వ్యక్తం చేశారు. 
 
గతంలో పనిచేసిన ఉపకులపతి తన వ్యక్తిగత ప్రవర్తనతో పాటుగా, పీజీ పరీక్షల పత్రాల మూల్యాంకనంలో, పరిపాలనా నిర్ణయాలలో అవకతవకలకు పాల్పడిన  కారణంగా స్వయంగా రాజీనామా చేసి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. యూనివర్సిటీకి నియమిస్తున్న ఉపకులపతులు హైద్రాబాద్ కేంద్రంగా పాలనకొనసాగిస్తారని, యూనివర్సిటీలో చుట్టపుచూపుకు వచ్చివెళ్తారని చెబుతూ అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 
 
ఇంకా సిబ్బంది నియామకాల్లో, కళాశాలలకు అనుమతుల విషయంలో అనేక ఆరోపణలు వస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రాంబాబు విమర్శించారు. ఇప్పటికైన యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై అత్యున్నత కమిటీనీ నియమించి నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.