డీలిమిటేషన్‌పై రేవంత్ హైబ్రిడ్‌ ప్రతిపాదన హాస్యాస్పదం

డీలిమిటేషన్‌పై రేవంత్ హైబ్రిడ్‌ ప్రతిపాదన హాస్యాస్పదం
నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ విధానాన్ని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్‌లో తప్పుబడుతూ డీలిమిటేషన్‌ను రాష్ట్ర జీఎస్డీపీతో ముడిపెట్టడం ప్రపంచంలోనే అత్యంత తెలివి తక్కువ ప్రతిపాదనగా అభివర్ణించారు. రేవంత్‌ వాదనలకు తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకొంటున్నారని ఎద్దేవా చేశారు. 
రాష్ర్టాల జీఎస్డీపీ ఎప్పుడూ స్థిరంగా ఉండదని, ఏటా మారుతుందని పేర్కొన్న బీజేపీ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనకు జీఎస్డీపీతో ముడిపెట్టడం మూర్ఖత్వమే అవుతుందని చురకలు అంటించారు. ‘డీలిమిటేషన్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక ఆసక్తికరమైన హైబ్రిడ్‌ మాడల్‌ను ప్రతిపాదించారు. నియోజకవర్గాల పునర్విభజన చేసేటప్పుడు రాష్ట్ర జనాభాను, ఆ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)తో లింక్‌ చేయాలని రేవంత్‌ సూచిస్తున్నారు’ అని గుర్తు చేశారు. 
 
`ఇలాటి సలహాలను రేవంత్‌కు ఎవరు ఇస్తున్నారో నాకు తెలియడం లేదు లేదు గానీ, ఈ వాదనలను చూసి తెలంగాణ ప్రజలే నవ్వుకొంటున్నారు.  తెలంగాణలోని ఓ సామాన్యుడి ఓటు బీహార్‌ ఓటరు కంటే విలువైనదన్నట్టు రేవంత్‌ మాట్లాడుతున్నారు. ఒకవేళ రేవంత్‌ ఉద్దేశం ఇదే అయితే, ‘ప్రతి పౌరుడికీ ఓటు.. ప్రతి ఓటుకూ సమానమైన విలువ’ అనే రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని రేవంత్‌ తప్పుబడుతున్నట్టే లెక్క’ అంటూ విమర్శించారు. 
 
ధనవంతులకు ఎక్కువ ఓట్లు, పేదోడి ఓటుకు విలువే లేదన్నట్టు రేవంత్‌ వ్యవహారం ఉందంటూ ఒకవేళ, రేవంత్‌ ప్రతిపాదనను మనం ముందుకు తీసుకెళ్తే, ముఖేశ్‌ అంబానీకి లక్ష ఓట్లు వచ్చిపడతాయని, మనలాంటి సామాన్యులకు ఒకే ఓటు మిగులుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి లాజిక్‌లేని ప్రతిపాదనలను తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌ను రాష్ట్ర జీఎస్డీపీతో ముడిపెడుతూ రేవంత్‌ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రపంచంలోనే అత్యంత తెలివి తక్కువ ప్రతిపాదన అని,  రాజ్యాంగ విరుద్ధమైనదని, ‘ప్రతీ పౌరుడికీ ఓటు’ అనే రాజ్యాంగ సూత్రానికి ఇది విఘాతం కలిగిస్తున్నదని బీజేపీ ఎంపీ నిప్పులు చెరిగారు.

“స్పీకర్‌ సార్‌.. ఇక్కడ మరో కోణం ఉంది. ఏదైనా దేశ జీడీపీ అయినా, రాష్ట్ర జీఎస్డీపీ అయినా పది, పదిహేనేండ్లపాటు స్థిరంగా ఏమీ ఉండదు. ప్రతి ఆరు నెలలకూ జీడీపీ పెరుగొచ్చు లేదా తగ్గొ చ్చు. ఒక ఏడాది జీడీపీ ఎక్కువగా ఉంటే, మరో ఏడాది తగ్గొచ్చు. ఇప్పుడు రేవంత్‌ చెప్పినట్టు డీలిమిటేషన్‌ను జీఎస్డీపీతో లింక్‌ చేస్తే.. తరచూ సీట్ల సంఖ్యను మార్చాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. 

“ఈ ఏడాది తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిశాయని అనుకొందాం. అప్పుడు జీఎస్డీపీ బాగుంటే తెలంగాణకు అదనంగా సీట్లు ఇవ్వాలా? వచ్చే ఏడాది తమిళనాడులో అసలు వర్షాలే పడలేదు. కాబట్టి, తమిళనాడుకు రెండు సీట్లను కోత పెట్టాలా? ఇలాంటి అశాస్త్రీయమైన ప్రతిపాదనలను కాంగ్రెస్‌ తీసుకొస్తూ  ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డీలిమిటేషన్‌కు జీఎస్డీపీని లింక్‌ చేయాలన్న రేవంత్‌ ప్రతిపాదన ఎంతో హాస్యాస్పదమైనది” అంటూ ఎద్దేవా చేశారు.