మొయినాబాద్ డ్రగ్స్‌ కేసులో నిర్మాత కేదార్‌నాథ్‌ పేరు!

మొయినాబాద్ డ్రగ్స్‌ కేసులో నిర్మాత కేదార్‌నాథ్‌ పేరు!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్‌ పార్టీ కేసు దర్యాప్తులో తాజాగా దుబాయ్‌లో మరణించిన సినీ నిర్మాత కేదార్​నాథ్‌ పేరు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. అతనికి  బీఆర్‌ఎస్‌ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు, పలు డ్రగ్‌ పార్టీలకు ఇద్దరూ హాజరైనట్లు పోలీసులు తేల్చారు. రితేశ్‌ రెడ్డి ఖాతా నుంచి కేదార్‌నాథ్‌కు రూ.25 లక్షల నగదు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. 
 
పైలట్‌ రోహిత్‌ రెడ్డికి ఆయన సోదరుడు రితేశ్‌ రెడ్డికి బినామీగా కేథార్‌నాథ్‌ వ్యవహరించినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. రోహిత్‌ రెడ్డి తరఫున రితేశ్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు, వీరిద్దరి బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు పరిశీలించినప్పుడు అనుమానాస్పద నగదు లావాదేవీలు బయటపడ్డాయి. తాజాగా రితేశ్‌ ఖాతా నుంచి కేదార్‌నాథ్‌కు డబ్బు బదిలీ అవ్వడంతో రోహిత్‌ రెడ్డి ఆదేశాలతోనే ఇదంతా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన కేదార్‌నాథ్‌, సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. 2024లో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో గజ్జెల వివేకానంద్‌ ఇచ్చిన డ్రగ్స్‌ పార్టీకి కేదార్‌నాథ్‌ హాజరైనట్లు దర్యాప్తులో బయటపడింది. డ్రగ్స్‌ పాజిటివ్‌గా రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయనకు నోటీసులిచ్చి వదిలేశారు. 
 
సినీ, రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలున్న కేదార్‌నాథ్‌, హైదరాబాద్‌లో పబ్బులు నిర్వహించారు. అనూహ్యంగా 2025 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో మరణించాడు. కేదార్‌నాథ్‌ మరణించిన ఫ్లాట్‌లో రోహిత్‌ రెడ్డి ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగినా నిర్ధారణ కాలేదు. తాజా డ్రగ్స్‌ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో రోహిత్‌రెడ్డి, కేదార్‌నాథ్‌ మధ్య సన్నిహిత సంబంధాలు బయటపడుతున్నాయి. 
 
కేదార్‌నాథ్‌తో సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు రోహిత్‌ రెడ్డి, రితేశ్‌ రెడ్డి సమాధానాలివ్వలేదని, విచారణకు సహకరించకుండా ఇబ్బందిపెట్టినట్లు పోలీసులు ఇటీవల ఉప్పర్‌పల్లి కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా సిట్‌ దర్యాప్తులో ఫాంహౌస్‌ పార్టీకి డ్రగ్స్‌ తెచ్చిన అభిషేక్‌ సింగ్‌ ఈ కేసులో నిందితుడు అర్జున్‌రెడ్డికి సహాయకుడిగా పని చేస్తున్నట్లు తేలింది. 
 
మార్చి 14న ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీకి అర్జున్‌ రెడ్డి ఆదేశాలతోనే అభిషేక్‌ సింగ్‌ డ్రగ్స్‌ తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రగ్‌ పెడ్లర్లు రాకేశ్‌ వర్మ, అభిషేక్‌ సింగ్, గోవాకు చెందిన క్లింటన్‌ ముగ్గురూ పరారీలో ఉన్నారు. రాకేశ్‌ వర్మ, అభిషేక్‌ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. రోహిత్‌ రెడ్డి, రితేశ్‌ రెడ్డి, నమిత్‌ శర్మ ముగ్గురూ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.