రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన అసలేమాత్రం సజావుగా సాగలేదని, ప్రతి దశలోనూ ఇది లోపభూయిష్టంగానే జరిగిందని సర్వే సమయంలోనే అనేక ఆరోపణలు, అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అవన్నీ అక్షరాలా నిజమేనని సర్వే గణాంకాలు ఇప్పుడు స్పష్టంగా నిరూపించాయి. తెలంగాణ ప్రభుత్వం గత నవంబర్‌లో రాష్ట్రంలో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే- 2024) నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1,12,36,849 కుటుంబాలను (97.10%) సర్వే చేసింది.
మొత్తం 3,55,50,759 జనాభా వివరాలు సేకరించింది. ఆ సర్వే గణాంకాల విశ్లేషణ కోసం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక గణాంకాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో బుధవారం విడుదల చేశారు. అంతేకాదు, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు.
ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా వెనుకబడి ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఉన్నారు. బీసీల్లో అత్యధికంగా లబ్ధిపొందుతున్నది కేవలం ఐదు కులాలేనని నివేదిక తేల్చింది. ముదిరాజ్, యాదవ, మున్నూరుకాపులు జనాభాతోపాటుగా రాజకీయంగా బలంగా ఉన్నట్టు తెలిపింది. బీసీ ఈ క్యాటగిరీలో షేక్‌లు అత్యధికంగా ఉన్నారని వివరించింది. గౌడ, పద్మశాలీ, కురుమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారని నివేదించింది. మొత్తం గా షేక్, ముదిరాజ్, యాదవ, గౌడ్, మున్నూరుకాపులో బీసీ జనాభాలో 30% ఉన్నారని తేల్చింది.
రాష్ట్రంలో మొత్తం కులాలు 242 ఉన్నట్టు ప్రభుత్వం లెక్క తేల్చింది. బీసీ క్యాటగిరీలో మొత్తం 133 కులాలు ఉండగా, ఇందులో 69 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని, 64 కులాల్లో తక్కువ వెనుకబాటు తనం ఉన్నదని తేల్చింది. ఎస్సీ క్యాటగిరీలో 59 కులాలు ఉండగా ఇందులో 41 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నట్టు పేర్కొన్నది. ఎస్టీల్లో 32 కులాలు ఉండగా 25 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిపింది. ఓసీ క్యాటగిరీలో మొత్తం 18 కులాలు ఉండగా, అందులో ఒక్క కులం కూడా అత్యంత వెనుకబడిన క్యాటగిరీలో లేకపోవడం గమనార్హం.

More Stories
దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అనవసర దుష్ప్రచారం
నియోజకవర్గాల పునర్విభజనకు ఇండియా కూటమి వ్యతిరేకం