పశ్చిమ్ బెంగాల్‌లో జరుగుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి న్యాయస్థానం ఏర్పాటుచేసిన ట్రైబ్యునల్ ఆమోదించినవారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు గల ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అప్పీలేట్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
అప్పీలేట్ ట్రైబ్యునల్ ద్వారా అప్పీళ్లు అనుమతించిన (ఆమోదించిన) వ్యక్తులు ఏప్రిల్ 23న తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 27 నాటికి అప్పీళ్లు పరిష్కరించిన ఇతర వ్యక్తులు కూడా తమ ఓట్లను వేయడానికి అనుమతించనున్నారు. ఇలాంటి సందర్భాలలో సవరించిన అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఈసీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు సంబంధిత వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలు కల్పించింది.
ఈ తీర్పుపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తొలగింపునకు గురైన ఓటర్లు సంబంధిత పత్రాలను చూపించి పేర్లను నమోదుచేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సుప్రీంకోర్టు ఆదేశాలతో కలకత్తా హైకోర్టు ట్రైబ్యునల్స్ ఏర్పాటుచేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో మొత్తం 90 లక్షలకుపైగా ఓటర్లు తొలగించగా, 60 లక్షల మందిని పెండింగ్‌లో పెట్టారు.
వీరంతా అవసరమైన పత్రాలను సమర్పించడంతో వాటి పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకూ 30 లక్షల మంది పిటిషన్లను ట్రైబ్యునళ్లు పరిష్కరించినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుతో వీరంతా ఓటువేసేందుకు అవకాశం కలిగింది. అయితే, అప్పీల్ పెండింగ్‌లో ఉంటే ఓటు హక్కు లభించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరో మాటలో చెప్పాలంటే అప్పీల్‌పై తీర్పు వెలువడే వరకు ఓటు వేయడానికి అనుమతి ఉండదని సుప్రీంకోర్టు పేర్కొంది.
పశ్చిమ్ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పాల్గొన్న న్యాయాధికారులకు కల్పించిన భద్రత అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు కొనసాగుతుందని, తమ ముందస్తు అనుమతి లేకుండా దానిని ఉపసంహరించుకోవడానికి వీలులేదని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం మాల్దా జిల్లాలో ఏప్రిల్ 1న ఏడుగురు న్యాయాధికారులను ఘెరావ్ చేసినందుకు అరెస్టు చేసిన వారికి ‘ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా?’ అని కూడా ఆరా తీసింది. ఈ సందర్భంగా ‘దీనికి ఒక తార్కిక ముగింపునకు తీసుకురావాలి’ అని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.

More Stories
‘హోర్మూజ్’పై మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది సీట్లు తగ్గవు
సైనిక ఘర్షణ సమస్యలను పరిష్కరించలేదు