* లోక్‌సభలో మూడు బిల్లులు.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు వచ్చాయి. దేశంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కేంద్రం తీసుకొచ్చిన మూడు కీలక బిల్లులపై లోక్ సభలో వాడీవేడి చర్చ జరిగింది. మొదట ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని తప్పుపట్టాయి.
విపక్షాల వాదనను అధికార పక్షం తోసిపుచ్చింది. ఈ క్రమంలో రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా మెజార్టీ వచ్చింది. అనంతరం 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ నెలకొంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా ఆయన సభ ముందుకు తీసుకొచ్చారు.
అంతకుముందు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. “ఈ రోజు పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. 2023లోనే నారీశక్తి వందన్ అధినియం బిల్లును ఆమోదం పొందింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందగా, ఇప్పుడు వాటిని అమలు చేయాల్సిన సమయం వచ్చింది. కొన్ని బిల్లులను భావితరాలు మరువలేవు” అని మేఘవాల్ తెలిపారు.
“రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 (2) ప్రకారం ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్టికల్ 368 ద్వారా ప్రజాహిత నిర్ణయాలకు పార్లమెంటుకు రాజ్యాంగం శక్తి ఇచ్చింది. ఈ క్రమంలోనే మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాం. బిల్లు ద్వారా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది” అని చెప్పారు.
“మహిళలకు సామాజిక న్యాయం కోసం కేంద్రం అనేక పథకాలు తెచ్చింది. మహిళలకు శౌచాలయాలు, ఉజ్వల యోజన అమలు చేశాం. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం జరగాల్సిందే. మహిళలకు జన్‌ధన్ ఖాతాలు, పీఎం ముద్రా యోజన అమలు చేశాం. సుకన్య సమృద్ధి యోజన, లఖ్‌పతీ దీదీ వంటి పథకాలు అమలు చేశాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూత నిచ్చాం” అని అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ వివరించారు.
అయితే 131వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, టీఎంసీ, కేరళ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఎంఐఎం, సిపిఐ, ఇతర వివక్షాలు బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం బుల్డోజ్ చేస్తోందని మండిపడ్డాయి. “అప్రజాస్వామిక బిల్లును ఉపసంహరించుకోవాలి. జనాభా గణనపై ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపట్లేదు? కేంద్రం ఉద్దేశపూర్వకంగా ముస్లింలను మినహాయిస్తోంది. మూడు బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోవాలి.” అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

More Stories
సైనిక ఘర్షణ సమస్యలను పరిష్కరించలేదు
రిజర్వేషన్లను అడ్డుకునే వారిని మహిళలు క్షమించరు
కులగణన, రిజర్వేషన్ లపై అఖిలేశ్, అమిత్ షా మాటల హోరు