* శబరిమల కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన వాఖ్యలుచేసింది. సామాజిక సంక్షేమం, సంస్కరణల పేరుతో ఒక మతం మూలాలను, అందులో అంతర్భాగమైన ఆచారాలను పూర్తిగా తొలగించడం, నిర్వీర్యం చేయడం అస్సలే సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా “కోట్లాది మంది ప్రజలు దశాబ్దాలుగా పాటిస్తున్న నమ్మకాలు తప్పు అని ప్రకటించడం న్యాయస్థానాలకు అత్యంత కష్టతరమైన పని” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయ పడ్డారు. ఈ విచారణలో భాగంగానే మతపరమైన అంశాల్లో మూడో వ్యక్తులు దాఖలు చేసే ప్రజాప్రయోజన వాజ్యాల పరిమితులపై కూడా చర్చ జరిగింది. పిటిషనర్లకు ఆ మతంతో నేరుగా సంబంధం లేనప్పుడు, అలాంటి పిల్స్‌ను ఎంతవరకు అనుమతించాలనే అంశంపై జస్టిస్ బి.వి. నాగరత్న ఆందోళన వ్యక్తం చేశారు.
సంస్కరణల పేరుతో మతాన్ని నిస్సారంగా మార్చలేమని ఆమె ఉద్ఘాటించారు. ట్రావెన్‌కూర్ దేవస్వం బోర్డు తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను ఇస్తుందని, ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన సంస్థలు తమ అంతర్గత వ్యవహారాలను నిర్వహించుకునే అధికారాన్ని కల్పిస్తుందని గుర్తు చేశారు.
ఈక్రమంలోనే ఆలయాల్లోకి ప్రవేశించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ అంతర్గత ఆచారాలను ఎలా నిర్వహించాలో నిర్ణయించే హక్కు ఆ సంస్థకే ఉంటుందని సింఘ్వీ వాదించారు. చట్టాలు చేసేటప్పుడు మతం ప్రాథమిక గుర్తింపు దెబ్బతినకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. మతంలోని ఏ ఆచారం అత్యవసరమో ఏది కాదో నిర్ణయించే అధికారం న్యాయమూర్తులకు ఉండకూడదని సింఘ్వీ సూచించారు.
ఈ తరుణంలో, జస్టిస్ బాగ్చి ఒక ఊహాజనిత ప్రశ్నను సంధించారు. ఒక మత నాయకుడు మోక్షం పొందే మార్గంగా సామూహిక ఆత్మహత్యను ప్రబోధిస్తే, మరియు అనుచరులు తమ జీవితాలను ముగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఆ ఆచారాన్ని ప్రశ్నిస్తూ ఆ వర్గానికి చెందని వ్యక్తి దాఖలు చేసిన పిల్ పై కోర్టు చర్య తీసుకోలేదా?
ఇది ఒక “తీవ్రమైన కేసు” అని పేర్కొంటూ, అసాధారణ పరిస్థితులలో అటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించడంలో కోర్టుకు బహుశా సమర్థన ఉండవచ్చని సింఘ్వి చెప్పారు. కానీ జోక్యం చేసుకోకపోవడమే సాధారణ నియమంగా ఉండాలి. అటువంటి తీవ్రమైన కేసులో, ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోసం వేచి చూడకుండా, కోర్టు సుమోటోగా కూడా చర్య తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

More Stories
దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవు
నియోజకవర్గాల పునర్విభజనకు ఇండియా కూటమి వ్యతిరేకం
భారత్‌లో చొరబాటుకు సిద్ధంగా 800 మంది ఉగ్రవాదులు