నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పడం బీఆర్ అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. 
 
రాజ్యాంగ ప్రియంబుల్‌లోనే ‘ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాం’ అని స్పష్టంగా ఉందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తమ పార్టీయే ఇచ్చిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  నియోజకవర్గాల పునర్విభజన అనేది ఆర్టికల్ 82, 170 ప్రకారం ప్రతి పది ఏళ్లకు జరిగే జనగణన ఆధారంగా చేపట్టే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దీనిపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన  ప్రక్రియలో భాగంగా, భారత రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌తో సంప్రదించి డీలిమిటేషన్ కమిషన్‌ను నియమిస్తారని, ఆ కమిషన్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వంటి సభ్యులు ఉంటారని ఆయన వివరించారు. అదేవిధంగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే  లాంటి నాయకులు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

గత చరిత్రను గుర్తు చేస్తూ, 1952, 1962, 1972, 2002లో నియోజకవర్గాల పునర్విభజన  జరిగిన విషయాన్ని ప్రస్తావించిన మహేశ్వర్ రెడ్డి, 1962లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 43 సీట్లు ఉండగా, 1972లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన  నియోజకవర్గాల పునర్విభజన వల్లే మనకు ఒక సీటు తగ్గి 42 అయిందని గుర్తు చేశారు.  

గతంలో కాంగ్రెస్ చేసిన పునర్విభజన వల్లే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, కానీ ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో 50 శాతం పైగా సీట్లు పెంచి, పార్లమెంటు సీట్ల సంఖ్యను 850కి చేర్చడం ద్వారా సామాజిక న్యాయం చేయాలని చూస్తోందని ఆయన చెప్పారు. దీనివల్ల దాదాపు 80 మంది అదనపు ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు గణనీయంగా అధిక ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని తెలిపారు. 
 
మహిళా రిజర్వేషన్లు పెరగడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా? ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెరగడం కాంగ్రెస్ చూడలేకపోతోందా? అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఆర్టికల్ 330, 332 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని ఆయన గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్ పాలసీ’ లేదా ‘జీఎస్‌డీపీ మోడల్’ అనే దానికి అసలు రాజ్యాంగబద్ధత లేదని మహేశ్వర్ రెడ్డి కొట్టిపారేశారు.
జీఎస్‌డీపీ  అంటే ‘గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్’అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పన్నులు కట్టే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి చెప్పే పద్ధతిని రాష్ట్రంలో అమలు చేస్తే, రెవెన్యూ తక్కువగా ఉండే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి వెనుకబడిన జిల్లాల్లో సీట్లు తగ్గించి, కేవలం హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకే సీట్లు పెంచుతారా? అని ప్రశ్నించారు. 
 
ఇది పేదలను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర కాదా? అని ప్రశ్నించారు. గణాంకాలతో సహా ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన మహేశ్వర్ రెడ్డి, బీజేపీ మోడల్ వల్లే దక్షిణాదికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 129 సీట్లు (24%), బీజేపీ ప్రతిపాదించిన 53% సీట్ల పెంపు ఫార్ములా వల్ల 198కి పెరుగుతాయని వివరించారు. 
 
ఒకవేళ కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ చెప్పినట్లు కేవలం జనాభా ప్రాతిపదికన (2011 సెన్సస్) వెళ్తే కేవలం 171 సీట్లు, ఎలక్ట్రోరల్ ట్రెండ్ ప్రకారం వెళ్తే కేవలం 159 సీట్లు మాత్రమే వస్తాయని, తద్వారా దక్షిణాదికి 39 సీట్ల వరకు నష్టం జరుగుతుందని ఆయన లెక్కలు చూపారు.