రామమందిర విరాళాల సొమ్ము చోరీ ఘటన నేపథ్యంలో దోషులు ఎవరైనప్పటికీ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. శుక్రవారం అయోధ్య పర్యటనలో మాట్లాడుతూ, ప్రజలు సంయమనం పాటించాలని కోరిన ఆదిత్యనాథ్, రామ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.
అలాగే, ఈ ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే వాటిని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) సమర్పించాలని కోరారు. మందిర ట్రస్ట్ అభ్యర్థన మేరకు సిట్ ని ఏర్పాటు చేశామని చెబుతూ ఈ దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయోధ్య లేదా రామ జన్మభూమి మందిర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలకు లోనుకావద్దని, శ్రీరాముని ఆదర్శాలైన గౌరవం, సహనాన్ని పాటించాలని భక్తులకు ఆయన పిలుపునిచ్చారు.
రామమందిర ఉద్యమాన్ని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయని ఆరోపించిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వాలు రామ భక్తులు, కరసేవకులపై చర్యలు తీసుకున్నాయని గుర్తు చేశారు. అయోధ్య విషయంలో కాంగ్రెస్ “ద్వంద్వ ప్రమాణాలు” పాటిస్తోందని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన అదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పవిత్ర నగరం పట్ల ఆందోళన చెందుతున్నట్లు నటిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
“వారి ద్వంద్వ ప్రమాణాలను చూడండి. అయోధ్యలో శ్రీరాముని మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించిన అదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అయోధ్య పట్ల తీవ్ర ఆందోళన ఉన్నట్లు నటిస్తోంది,” అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి విమర్శించారు. కోర్టులో కూడా కాంగ్రెస్ రామమందిర ఉద్యమాన్ని వ్యతిరేకించిందని ఆయన ఆరోపించారు.
“వారు దానిని అడ్డుకోవడానికి తమ శక్తినంతా ఉపయోగించారు, అంతేకాకుండా అత్యంత సిగ్గుమాలిన రీతిలో శ్రీరాముడు అసలు లేనే లేడని సుప్రీంకోర్టులో అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీయే నేడు అయోధ్య విషయంలో ఆందోళన చెందుతూ, రామ భక్తులు అవమానానికి గురయ్యారని వాదిస్తోంది,” అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
సమాజ్‌వాదీ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్న ఆదిత్యనాథ్, రామ భక్తుల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని కపటత్వంతో కూడుకున్నదని విమర్శించారు. “సమాజ్‌వాదీ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను కూడా చూడండి. రామ భక్తులు అవమానానికి గురయ్యారని నేడు వారు మాట్లాడుతున్నారు, కానీ ‘జై శ్రీరామ్’ అని నినదించిన వారిపై లాఠీచార్జ్ చేయించి, ‘కరసేవకుల’పై కాల్పులకు ఆదేశించిన వారు వీరే కదా. ఇప్పుడు వారు ఇతరులకు నీతులు చెప్పడానికి ముందుకు వచ్చారు,” అని ఆయన మండిపడ్డారు.
రామ మందిరంలో విరాళాల వివాదం రామ మందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై వివాదం ఈ నెల మొదట్లో వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయల విరాళాలకు లెక్కలేదని నివేదికలు సూచిస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోర్టులు సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు.
తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆలయ ట్రస్ట్ ఖండించింది. దీంతో, ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. గత సోమవారం నుండి జరుపుతున్న విచారణలో భాగంగా ఈ బృందం పలువురిని ప్రశ్నించడం కొనసాగిస్తోంది.
ఇలా ఉండగా, అయోధ్య జిల్లాలోని ‘మర్యాదా పురుషోత్తమ’ శ్రీరాముని పవిత్ర భూమిలో, గొప్ప వీరనారి ఝల్కారీ బాయి భారీ విగ్రహాన్ని యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, రూ. 378 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న రాష్ట్ర స్థాయి ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రితో సహా 125 అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అలాగే వివిధ పథకాల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాల పంపిణీ కూడా జరిగింది.

More Stories
కంటోన్మెంట్లో 21 రోడ్లకు బ్రిటీషర్ల స్థానంలో భారితీయ వీరుల పేర్లు
జార్ఖండ్లో ఎన్డీఏ అభ్యర్థి నత్వానీ గెలుపుతో రాజ్యసభలో 2/3 ఆధిక్యత
అమెరికా ఒప్పందంలో ఇరాన్ కు రాయితీలు… ఇజ్రాయెల్ కు అవమానాలు!