హైదరాబాద్‌లో ఇప్పుడు కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరు మీద ఒక రహదారి ఉంది. గతంలో వెల్లింగ్టన్ రోడ్‌గా పిలవబడే ఈ రహదారికి పేరు మార్చడాన్ని సూచిస్తూ, సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసి) సెంటర్ చౌక్ సమీపంలో ‘విక్రమ్ బాత్రా మార్గ్’ అనే పేరును ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలలో రాసి ఉన్న నీలి రంగు సైన్‌బోర్డు ఒకటి వెలిసింది.
నెపోలియన్ బోనాపార్టేను ఓడించి ఇంగ్లండ్‌కు రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ పేరు బదులు ఆ రోడ్డుకు కార్గిల్ అమరవీరుడి పేరు పెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో, పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో, ‘అటల్ బిహారీ వాజ్‌పేయి రోడ్’ అని ప్రకటించే మరో సైన్‌బోర్డు కనిపించింది. సికింద్రాబాద్‌లోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్ సమీపంలో బోల్టన్ రోడ్‌కు వెళ్లే రహదారికి ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి పేరు పెట్టారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ది దేశ చరిత్రలోనే ప్రత్యేక స్థానం. అందులో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ)కి 200 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. ఇంతకాలంగా ఆంగ్లేయ పాలకుల పేర్లున్న ఆ ప్రాంత రోడ్లకు ఇప్పుడు భారతదేశం కోసం అసువులు బాసిన అమరవీరులు, త్యాగధనులు, మహనీయుల పేర్లు పెడుతున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ ప్రకటించారు.
వలసవాద వారసత్వాలను తొలగిస్తూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 21 రహదారి భాగాలకు, నాలుగు బజార్ ప్రాంతాలకు, దేశం కోసం యుద్ధాలలో పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన ప్రముఖ భారతీయులు, సైనిక అధికారులు, సైనికుల పేర్లను పెట్టనున్నారు. దీని ప్రకారం, లిట్టన్ రోడ్‌ను నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రోడ్‌గా, బర్టన్ రోడ్డుకు ఆరేళ్ల కిందట గాల్వాన్ ఘర్షణలో అసువులు బాసిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పేరుతో సంతోష్ బాబు మార్గ్‌గా, నోబుల్ రోడ్‌ను ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్‌గా పిలుస్తారు.
ముంబై ఉగ్రదాడిలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరును రిచర్డ్‌సన్ రోడ్డుకు, లెఫ్టినెంట్ కల్నల్ ఏబీ తారాపూర్ పేరు ప్యాట్నీ రోడ్డుకు పెడుతున్నారు. కార్న్‌వాలిస్ రోడ్డును స్వామి వివేకానంద మార్గ్‌గా, గౌహ్ రోడ్డును పరమవీర చక్ర సోమనాథ్ శర్మ మార్గ్ గా మారుస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్‌సిబి) అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఈ 21 బ్రిటిష్ కాలం నాటి రోడ్ల పేరు మార్పుకు ఆమోదం లభించిందని ఎస్‌సిబి ముఖ్య కార్యనిర్వహణాధికారి అరవింద్ కుమార్ ద్వివేది తెలిపారు.
“ప్రస్తుతం ఉన్న రోడ్ల నుండి వలసవాద కాలం నాటి పేర్లను తొలగించి, కొత్త పేర్లను పెట్టే ప్రక్రియ నెలలోపు పూర్తవుతుంది,” అని ఆయన చెప్పారు. ఇతర రోడ్లకు కంపెనీ క్వార్టర్‌మాస్టర్ హవిల్దార్ అబ్దుల్ హమీద్, మేజర్ సోమనాథ్ శర్మ, లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్, నాయక్ జదునాథ్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ ధన్ సింగ్ థాపా, కెప్టెన్ గురు బచన్ సింగ్ సలారియాతో సహా పరమ వీర చక్ర పురస్కార గ్రహీతలు, సైనిక సిబ్బందిని గౌరవిస్తూ పేర్లు పెడతారు.
బజార్ ప్రాంతంలో, హేర్ రోడ్‌ను తార్‌బంద్ టెంపుల్ రోడ్‌గా, 108 బజార్‌ను ఇన్ఫాంట్రీ బజార్‌గా, ఆర్ఏ పెన్షనర్స్ లైన్స్‌ను ఆర్టిలరీ పెన్షనర్స్ లైన్‌గా మార్చనున్నారు. రోడ్లతో పాటు, కంటోన్మెంట్ పరిధిలోని నాలుగు బజార్ ప్రాంతాల పేరు మార్పుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. పాత పేర్లను తొలగించి, ఆయా రోడ్లు, బజార్లకు దేశం కోసం ప్రాణాలర్పించిన, యుద్ధాల్లో పోరాడిన ధైర్యవంతులైన సైనిక అధికారులు, సైనికుల పేర్లను పెట్టారు. స్థానిక స్థాయిలో చేపట్టిన ఈ పేరు మార్పు కార్యక్రమం, ఒక విస్తృత జాతీయ ఆదేశానికి అనుగుణంగా జరిగింది.
భారతదేశంలోని 62 కంటోన్మెంట్ బోర్డుల పరిధిలోని రోడ్ల పేర్లను మార్చాలని రక్షణ శాఖ మొదట 2021లో ప్రతిపాదించింది. ఈ కంటోన్మెంట్ బోర్డులలోని అనేక రోడ్లు, భవనాలకు, గతంలో బ్రిటిష్ పాలకునికి విధేయులుగా ఉన్న బ్రిటిష్ అధికారులు, సైనికుల పేర్లు గతంలో పెట్టారు.

More Stories
జార్ఖండ్‌లో ఎన్డీఏ అభ్యర్థి నత్వానీ గెలుపుతో రాజ్యసభలో 2/3 ఆధిక్యత
అమెరికా ఒప్పందంలో ఇరాన్ కు రాయితీలు… ఇజ్రాయెల్ కు అవమానాలు!
అంతరిక్షం, అణుశక్తి, ఏఐలో భారత్ దూసుకుపోతోంది