ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి గత 45 రోజులుగా అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. ఫిన్‌లాండ్ దేశంలో బీటెక్ చదువుతున్న సదరు విద్యార్థి ఎక్కడున్నాడో, ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోజులు గడుస్తున్నా అటు విదేశీ అధికారుల నుండి కానీ, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం వైదేహి నగర్‌కు చెందిన జి. మర్ణత, ముత్యంరెడ్డిల కుమారుడు గండ్ర మణిదీప్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఫిన్‌లాండ్ వెళ్లాడు. అక్కడ లాతి పట్టణంలోని ప్రసిద్ధ ఎల్‌యూటీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల మే 4వ తేదీన మణిదీప్ తన తల్లిదండ్రులతో ఫోన్‌లో ఆఖరిసారిగా మాట్లాడాడు.
అయితే మే 5వ తేదీ నుంచి అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. కుమారుడి సమాచారం కోసం తల్లిదండ్రులు ఫిన్‌లాండ్‌లో ఉంటున్న అతని స్నేహితులను, తెలిసిన వారిని సంప్రదించారు. వారు మణిదీప్ ఉంటున్న రూమ్‌కు, కాలేజీకి వెళ్లి వెతికినా ఎలాంటి లాభం లేకపోయింది.
అతని ఆచూకీ లభించకపోవడంతో స్నేహితుల సాయంతో అక్కడి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ‘మిస్సింగ్ కేసు’ కూడా నమోదు చేయించారు. అయినప్పటికీ ఒకటిన్నర నెల గడుస్తున్నా మణిదీప్ రెడ్డి జాడ తెలియలేదు. తమ కొడుకు అదృశ్యంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు ముత్యంరెడ్డి, మర్ణత న్యాయ పోరాటానికి దిగారు.
తమ బిడ్డ ఆచూకీ కనుగొనేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వారు తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్‌రెడ్డి నేతృత్వంలో కీలక విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ ఫిన్‌లాండ్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారని కోర్టుకు వివరించారు.
ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ ఫిన్‌లాండ్‌లో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడంపై తక్షణమే పూర్తి వివరాలతో కూడిన వివరణ ఇవ్వాలంటూ కేంద్ర విదేశాంగ శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. అదృశ్యంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను నివేదించాలని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ఫిన్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి దర్యాప్తు వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

More Stories
కంటోన్మెంట్లో 21 రోడ్లకు బ్రిటీషర్ల స్థానంలో భారితీయ వీరుల పేర్లు
కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అబద్దాలు!
మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు