కరోనా వైర‌స్ లీకైన వుహాన్ ల్యాబ్‌కు ఫౌసీ నిధులు

కరోనా వైర‌స్ లీకైన వుహాన్ ల్యాబ్‌కు ఫౌసీ నిధులు

* అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్ట‌ర్ తుల‌సీ గ‌బ్బార్డ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు 

యావత్తు ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి పుట్టుకకు కారణమని భావిస్తున్న చైనాలోని వూహాన్ ల్యాబ్‌కు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ నిధులు సమకూర్చారని పదవీవిరమణ చేయనున్న అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు.  తన పదవీకాలం చివరి రోజున గతంలో బయటకు రాని కొన్ని కీలక పత్రాలను గబ్బార్డ్ విడుదల చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు. 

కరోనా వ్యాప్తికి కార‌ణ‌మైన ఆ ల్యాబ్‌పై స‌మాచారాన్ని దాచి పెట్టే విధంగా ఫౌసీ ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆమె తెలిపారు. వుహాన్ ల్యాబ్ గురించి అమెరికా కాంగ్రెస్‌ను కూడా ఫౌసీ త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని తుల‌సీ గ‌బ్బార్డ్ పేర్కొన్నారు.   అమెరికా కరోనా నివారణ చర్యలకు నేతృత్వం వహించిన ఫౌచీ చైనాలోని వూహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై ప్రమాదకరమైన గెయిన్-ఆఫ్-ఫంక్షన్ పరిశోధనలకు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి మిలియన్ల డాలర్లను నిధులుగా అందించారని ఆమె ఆరోపించారు.

ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని దాచిపెట్టడానికి రాజకీయ ప్రేరేపిత నాయకత్వంతో కలిసి పనిచేశారని గబ్బార్డ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  క‌రోనా వైర‌స్ వ్యాప్తికి, చైనాలోని వుహాన్ వైరాల‌జీ ల్యాబ్‌కు క‌నెక్ష‌న్ ఉన్న‌ట్లు గ‌తంలో అమెరికా ఆరోపించిన విష‌యం తెలిసిందే. అయితే త‌న వ‌ద్ద ఉన్న క్లాసిఫైడ్ స‌మాచారాన్ని బ‌య‌ట‌పెడుతున్న‌ట్లు పేర్కొంటూ కరోనా వివాదంలో ఫౌసీ పాత్ర‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌న్న ఉద్దేశంతో ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.

‘‘కరోనాపై ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అంచనాలను ప్రభావితం చేయడంలో, తారుమారు చేయడంలో ఫౌచీ ప్రత్యక్ష పాత్రను, అలాగే 2024లో కాంగ్రెస్‌‌లో ప్రమాణం చేసిన ఆయన ఎలా అబద్ధం చెప్పారో ఈ పత్రాలు బట్టబయలు చేస్తున్నాయి. వైరస్‌పై పరిశోధనలపై ఇంటెలిజెన్స్ అధికారులతో జరిగిన చర్చల గురించి తనకు తెలియదని లేదా వాటిలో పాల్గొనలేదని ఫౌచీ అబద్దాలు చెప్పారని నిరూపిస్తున్నాయి’’ అని ఆ ప్రకటన పేర్కొంది.

డిసెంబర్ 2022లో పదవి నుంచి వైదొలగే వరకు 38 ఏళ్లపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఎఐడి)కు చీఫ్‌గా వ్యవహరించిన ఫౌచీ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలతో ముడిపడి ఉన్న, అలాగే ట్రిలియన్ డాలర్ల విలువైన ప్రమాదకర కరోనా వైరస్ సార్వత్రిక వ్యాక్సిన్‌లపై పరిశోధనలకు నిధులు సమకూర్చారని కూడా గబ్బార్డ్ కార్యాలయం తెలిపింది.

‘‘తెరవెనుక సలహాదారుగా ఉంటూ, తాను స్వయంగా ఎంపిక చేసుకున్న నిపుణులతో కలిసి ప్రమాదకరమైన పరిశోధనలను దాచిపెట్టడానికి కరోనా వైరస్ జంతువుల నుంచి సహజంగానే పుట్టిందని ఇంటెలిజెన్స్ కమ్యూనిటీతో ఫౌచీ చెప్పించారు. ఆ తర్వాత అమెరికాకు కోవిడ్ నియంత్రణ నిపుణుడిగా మారి, బహిరంగంగా అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, నిజాలను తొక్కిపెట్టారు’’అని ఆరోపించింది.

అంతేకాదు, ‘‘కరోనా వ్యాప్తి సమయంలో, ఫౌచీ, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలోని కొందరు తమ స్వార్థం కోసం ఒకరికొకరు అనుకూలంగా నివేదికలుయారు చేసుకునేలా వ్యవస్థను సృష్టించారు. నిఘా విభాగానికి సలహాలు ఇవ్వడం కోసం  ఎన్ఐఎఐడి  నిధులతో పనిచేసే, తను స్వయంగా ఎంపిక చేసిన శాస్త్రవేత్తలను ఆయన పంపారు. ఈ సమాచారమే అధికారిక ఇంటెలిజెన్స్ అంచనాలను రూపొందించింది. ఆ తర్వాత ల్యాబ్-లీక్ సిద్ధాంతాన్ని తిరస్కరించేలా దీన్నే శాస్త్రవేత్తల ఏకాభిప్రాయంగా బహిరంగంగా వెల్లడించారు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాదు నిఘా కమ్యూనిటీ పరిశీలన కోసం ఒక నకిలీ పరిశోధనా పత్రాన్ని ఫౌచీ ప్రమోట్ చేశారని, దాని ప్రచురణకు ఆయనే స్వయంగా పురిగొల్పారని గబ్బార్డ్ కార్యాలయం ఆరోపించడం గమనార్హం. సీనియర్ విశ్లేషకులు ఫౌచీని ఒక విధానకర్తగా కాకుండా కరోనావైరస్ నిపుణులకు నిష్పక్షపాత మార్గదర్శిగా ప్రశంసించారని, అదే సమయంలో ఆయన కథనాలతో విభేదించే వారిని విస్మరించారని తెలిపింది.

సత్యాన్ని దాచడానికి ఆంథోనీ ఫౌచీ ఉపయోగించిన ఎత్తుగడలు నేరుగా డీప్ స్టేట్ ప్లేబుక్ నుంచి వచ్చినవే అని గబ్బార్డ్ స్పష్టం చేశారు.  ‘‘కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లేకలేనంత మంది ప్రజలకు అపారమైన కష్టాన్ని, బాధను కలిగించింది. సంవత్సరాల తరబడి అబద్ధాలు, అణచివేతలు, విషయాలను దాచిపెట్టిన అనంతరం అమెరికా ప్రజలకు పారదర్శకత, నిజాలు, జవాబుదారీతనం అవసరం’’ అని ఆమె తెలిపారు.