అమెరికాలో చదువు పూర్తిచేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులపై 1 లక్ష అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.95 లక్షలు) ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశముంది.
అమెరికా అధ్యక్షుడు నేతృత్వంలోని ప్రభుత్వం పరిశీలిస్తున్న ఈ ప్రతిపాదన ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి)’ కార్యక్రమానికి సంబంధించినది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన తర్వాత ఓపిటి ద్వారా ఉద్యోగాలు చేయడానికి అనుమతి పొందుతున్నారు. విద్యార్థి చదివిన కోర్సును బట్టి ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు అమెరికాలో పనిచేసే అవకాశం ఈ విధానం కల్పిస్తోంది.
ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితశాస్త్రం (స్టెమ్) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు మూడు సంవత్సరాల వరకు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. అనంతరం వారు హెచ్-1బి వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారిక గణాంకాల ప్రకారం, 2024లో దాదాపు 4.19 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఓపిటి ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు.
ఇందులో భారతీయులు, చైనా విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 1 లక్ష డాలర్ల ఫీజు ప్రతిపాదన విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రతిపాదనపై సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు అమెరికా కంటే ఇతర దేశాలను ఎంచుకునే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలు దీనివల్ల లాభపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాలకు కూడా ఈ నిర్ణయం ప్రతికూలంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే ట్యూషన్ ఫీజులు అనేక విశ్వవిద్యాలయాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి.
ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయనే భావన ఏర్పడితే, అమెరికాలో చదవాలనుకునే వారి సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాలకు సంబంధించి కూడా కొన్ని వర్గాలపై 1 లక్ష డాలర్ల ఫీజు విధించాలని ప్రయత్నించింది. అయితే, ఆ ప్రతిపాదనను బోస్టన్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇటీవల అడ్డుకుంది.
టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే, ఓపిటిపై ఫీజు ప్రతిపాదన విషయంలో అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

More Stories
చైనా పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు 400 రాకెట్ లాంచర్లను పంపిందా?
అరెస్ట్, మరణం, జైలు ప్రమాదాలున్నా స్వదేశం వెడతా!
రష్యా `ఉగ్రవాదుల’ జాబితాలో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్