ఫోటో దిగేందుకు అడుక్కుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై మెలోని మండిపాటు

ఫోటో దిగేందుకు అడుక్కుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై మెలోని మండిపాటు
ఇటీవల జరిగిన జీ7 సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫొటో దిగడం కోసం అడుక్కుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. అదో కట్టుకథ అంటూ కొట్టిపారవేస్తూ  తాను కానీ, ఇటలీ కానీ ఎవరినీ అడుక్కోదని మెలోని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ట్రంప్ చేసిన వాఖ్యలు పూర్తిగా కల్పితమని, వాటిలో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. 
 
ఈ మేరకు వీడియో సందేశం రిలీజ్ చేశారు. ‘‘ట్రంప్ ప్రకటన పూర్తిగా కల్పితం. ఆయన మాటలపై నేను దిగ్భ్రాంతి చెందాను. తన మిత్రదేశాలతో అమెరికా అధ్యక్షుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే తెలియడం లేదు. అయినా, ట్రంప్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు” అంటూ ఆమె ధ్వజమెత్తారు. 
 
“ట్రంప్ ఇదే తరహా అంకితభావాన్ని పశ్చిమ దేశాల శతృదేశాలపై మాత్రం చూపించలేడని నేను చెప్పగలను. పైగా అమెరికా శతృదేశాలపై ఆయన ఎంతో అనుకూలంగా ఉంటారు. కానీ, ట్రంప్ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. నేనుకానీ, ఇటలీకానీ.. ఎప్పుడూ, ఎవరినీ అడుక్కోదు’’ అంటూ మెలోని చెప్పుకొచ్చారు. ఆయన ఎందుకు అంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అంటూ ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 
 
ఈ సదస్సుపై డొనాల్డ్ ట్రంప్ ఒక ఇటలీ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన  సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫొటో దిగాలని ఎంతో ఆశపడ్డట్లు, దీనిపై మెలోని తనను బ్రతిమాలిందని తెలిపారు.  అయితే, తాను ఆమెతో ఫొటో దిగలేకపోయానని, ఇందుకు తనను క్షమించాలని కోరుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాను మెలోనితో మాట్లాడినందుకు ఆమె సంతోషపడి ఉంటారని ట్రంప్ పేర్కొన్నారు. 
 
దీంతో ట్రంప్ వాఖ్యలపై ఇటలీలో రాజకీయ దుమారం రేగుతోంది. దేశ ప్రధాని ట్రంప్‌ను ఫొటో అడగటం ఏంటని అక్కడివారు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది నేతలు జార్జియా మెలోనికి మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఇటలీ ఉప ప్రధాని అంటోనియో తజాని కూడా ట్రంప్ ప్రకటనను ఖండిచారు. మరో రెండు రోజుల్లో చేపట్టాల్సి ఉన్న అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.
 
మెలోని గతంలో ట్రంప్‌తో బలమైన సంబంధాన్ని కలిగి ఉండేవారు.  యూరప్, అమెరికా పరిపాలనా యంత్రాంగం మధ్య ఒక వారధిలా వ్యవహరించడానికి ఆమె తరచుగా ప్రయత్నించేవారు. అయితే, ఇరాన్ వివాదంపై పోప్ లియో చేసిన విమర్శల విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మెలోని తప్పుబట్టడంతో, ఈ ఏడాది ప్రారంభంలో వారి సంబంధాలలో ఉద్రిక్తత మొదలైంది.