పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ వేళ బహ్రయిన్ రాజు హమాద్ బిన్ ఈసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌లతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మాట్లాడారు. ఆ రెండు దేశాలపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. ఇక ఇదే సమయంలో బహ్రయిన్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల బాగోగులపై ప్రధాని ఆరా తీశారు.
బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజుకు మోదీ చేసిన ఫోన్ కాల్ సంభాషణల వివరాలను భారత ప్రభుత్వ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అంతకుముందు ఆదివారం రోజు యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు కూడా భారత ప్రధాని ఫోన్ కాల్ చేశారు. యూఏఈపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో కూడా మాట్లాడి మధ్యప్రాచ్యంలో పరిస్థితిపై భారతదేశం ఆందోళనలను తెలిపారు.
ఆ దాడుల వల్ల యూఏఈలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ కష్టకాలంలో యూఏఈకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవాస భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు యూఏఈ ప్రెసిడెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, ప్రాంతీయ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు.
“పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజులతో చర్చించాను. ఆ రెండు దేశాలపై ఇటీవలే ఇరాన్ చేసిన దాడులను ఖండించాను. ఈవిధంగా దాడులు చేయడం అనేది ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు భంగం కలిగించినట్లు అవుతుంది. అందుకే ఆ దాడులను భారత్ ఖండించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల యోగ, క్షేమాలను పర్యవేక్షిస్తున్నందుకు బహ్రయిన్ రాజు, సౌదీ యువరాజులకు ధన్యవాదాలు చెప్పాను” అని పేర్కొంటూ ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు.
“బహ్రయిన్ రాజుతో ఫోన్ కాల్లో నా చర్చలు ఫలవంతంగా జరిగాయి. ఆ దేశంపై ఇరాన్ చేసిన దాడులను భారత్ ఖండిస్తోంది. బహ్రయిన్ ప్రజలకు భారత్ సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. ఈ కష్టకాలంలో వారికి అండగా మేం నిలుస్తాం. ప్రవాస భారతీయుల భద్రతకు పెద్దపీట వేస్తున్నందుకు భారత్ తరఫున నా ధన్యవాదాలు” అని పేర్కొంటూ ప్రధాని మోదీ మరొక ట్వీట్ చేశారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూకు కూడా ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. ఆదివారం రోజు ఒమన్ విదేశాంగ మంత్రి బద్ర్ అల్ బుసైదీకి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్ చేసి మాట్లాడారు.

More Stories
భారత్ ను అర్థం చేసుకోవడానికి పాశ్చాత్య దృక్కోణం దాటండి
పశ్చిమాసియా ఘర్షణలతో దేశంలో అల్లర్లు… కేంద్రం హెచ్చరిక
భారత్, కెనడా మధ్య యురేనియం ఒప్పందం