పశ్చిమాసియా ఘర్షణలతో దేశంలో అల్లర్లు… కేంద్రం హెచ్చరిక

పశ్చిమాసియా ఘర్షణలతో దేశంలో అల్లర్లు… కేంద్రం హెచ్చరిక

ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలతో పశ్చిమాసియా అట్టడుకుతోంది. అమెరికా దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంపై షియా వర్గాలు భగ్గుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారీ ప్రదర్శనలు, నిరసనలు, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక, భారత్‌లోని జమ్మూ కశ్మీర్, యూపీ, కర్ణాటక, న్యూఢిల్లీ సహా పలుచోట్ల పెద్ద ఎత్తున ముస్లింలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో ఎక్కడైనా సామాజిక, మత పరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక లేఖ రాసింది.

 ఫిబ్రవరి 28న రాష్ట్రాలకు పంపిన లేఖలో అప్రమత్తంగా ఉండాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. దేశంలో హింసాత్మక ఘర్షణలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కోరింది. ఇరాన్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలపై రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని సూచించింది. 

అమెరికా, దాని మిత్రదేశాల ఎంబసీలు, కాన్సులెట్లు, పర్యాటక కేంద్రాలను ఇరాన్ మద్దతుదారులు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ‘‘రెచ్చగొట్టే ప్రసంగాలు, హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే ఇరాన్ అనుకూల ర్యాడికల్స్‌ను గుర్తించాలి.. ‘‘ఇరాన్ అనుకూల తీవ్రవాదులు, ప్రపంచ ఉగ్రవాద గ్రూపులు (జిటిజి) సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించాలి.. ఇరాన్ అనుకూల విద్యార్థి సంస్థలు, సామాజిక-రాజకీయ సంస్థలపై నిఘా పెంచాలి’’ అని రాష్ట్రాలకు సూచించింది.

ముఖ్యంగా మతపరమైన సభలు, సమావేశాలు, ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించింది. కొన్ని తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తులు విదేశీ పరిణామాలను ఉపయోగించుకుని ప్రజలను ప్రేరేపించే ప్రయత్నం చేయొచ్చని హెచ్చరించింది. ఇరాన్కు వ్యతిరేక భావజాలంతో ఉన్న కొంతమంది మత ప్రచారకులు ఉద్రిక్తతలు సృష్టించేలా ప్రసంగాలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. 

ఇలాంటి ప్రసంగాలు స్థానికంగా సామాజిక కలహాలకు దారి తీసే ప్రమాదం ఉందని, అందుకే ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల్లో కూడా పుకార్లు, తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని, వాటిని వెంటనే అరికట్టాలని సూచించింది.

రాష్ట్ర పోలీస్ విభాగాలు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్లు, కేంద్ర ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచాలని కేంద్రం తెలిపింది. అనుమానాస్పద సమావేశాలు, గుంపులు, విద్వేషపూరిత పోస్టులు, విదేశీ నిధుల ప్రవాహం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునేలా కంట్రోల్ రూమ్‌లను సిద్ధంగా ఉంచాలని, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలు ఇచ్చింది.

విదేశాల్లో జరిగిన సంఘటనలు దేశంలో సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. భారతదేశం మతపరంగా, భాషాపరంగా, సంస్కృతిపరంగా వైవిధ్యభరితమైన దేశం కావడంతో చిన్న ఉద్రిక్తత కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా నిరోధించాలనే ఉద్దేశంతో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు, విద్వేషపూరిత పోస్టులు వేగంగా వ్యాప్తి చెందే ఈ కాలంలో సోషల్ మీడియా పర్యవేక్షణ కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉండే సమాచారాన్ని వెంటనే తొలగించాలనీ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.