ఈనెల 22న బీజేపీ రాష్ట్ర వ్యాప్త సంబరాలు

ఈనెల 22న బీజేపీ రాష్ట్ర వ్యాప్త సంబరాలు
 
* ఈనెల 14వ తేదీ న జెపి నడ్డా విశాఖ రాక

జీఎస్టీ సంస్కరణలు తీసుకు రావడం ద్వారా సాధారణ ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు విశాఖ సాగర తీరంలో  పాలాభిషేకం నిర్వహించారు.  విశాఖ నగర బిజెపి కార్యకర్తలు ఉదాయాన్నే ఈ కార్యక్రమానికి ప్రదర్శనగా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ సరళీకృత జిఎస్టీ ఈ నెల 22వ తేదీ నుంచి అమలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 2017 లో జిఎస్టీ అమలు లోకి వచ్చిందని, అయితే జి ఎస్ టిని రెండు అంచెలకు తీసుకు వచ్చి దేశ ప్రజలుకు ఊరట నిచ్చే విధంగా సరళీకరణ చేసారని ఆయన కొనియాడారు. దీనితో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని,  రైతాంగానికి అవసరమైన వస్తువులు ధరలు తగ్గుతాయని తెలిపారు.
 
ఈ చర్యతో నిర్మాణ రంగానికి ఉపశమనం కలుగుతుందని,  మధ్యతరగతి ప్రజలుకు ఊరట లభిస్తుందని పేర్కొంటూ జిఎస్టీ తగ్గింపు అన్నివర్గాల లో ఆనందాన్ని ఇస్తుందని మాధవ్ హర్షం వ్యక్తం చేశారు.  అదేసమయంలో, హానికరమైన పదార్థాలపై జిఎస్టీ పెంచడం మేలుగా భావించాలని సూచించారు.
జిఎస్టీ తగ్గింపు అన్నివర్గాల ప్రజలు కు దసరా, దీపావళి సంక్రాంతి పండుగ సంబరాలు ముందే వచ్చాయన్న ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.

కాగా, ఈనెల 14వ తేదీన విశాఖ లో రైల్వే గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హాజరవుతున్నట్లు మాధవ్ తెలిపారు. సారధ్యం యాత్ర ముగింపు కార్యక్రమంగా ఈ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాలాభిషేకం  కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మురళీ పరుశురాం రాజు,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర, రాష్ట్ర సోషల్ మీడియా ఇంఛార్జి కేశవ్ కాంత్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, ఆర్టీఐ కన్వీనర్ వెంగమాంబ శ్రీ నివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.