అనంతపూర్ లో కూటమి పార్టీల ‘సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌’సభ రేపే!

అనంతపూర్ లో కూటమి పార్టీల ‘సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌’సభ రేపే!
 
* ‘కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పని చేస్తున్నాం. భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం’ సందేశంతో
 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సిద్ధమయ్యాయి. మొదటిసారిగా మూడు కూటమి పార్టీలు – టిడిపి, జన సేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా అనంతపురంలోని ఇంద్రప్రస్థనగర్‌లో మంగళవారం ‘సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించనున్నాయి. 
 
అధికారంలోకి వచ్చాక మూడు పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ సహా మూడు పార్టీల అగ్రనేతలు హాజరుకానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.
15 నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చుతో సూపర్‌సిక్స్‌ హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్ని నేతలు వివరించనున్నారు. ‘కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పని చేస్తున్నాం. భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం’ అనే సందేశాన్ని ప్రజలకు, మూడు పార్టీల కార్యకర్తలకు అందించనున్నారు.
సామాజిక పింఛన్ల పెంపు, దీపం 2.0 కింద ఉచితంగా గ్యాస్‌ సిలెండర్ల పంపిణీ, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పారిశ్రామిక పెట్టుబడులు, యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ సహా పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలను నేతలు ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్ని సభలో చెప్పనున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో కూటమి పార్టీల సమన్వయం, కేంద్రం అందిస్తున్న సాయం, 60వేల నామినేటెడ్‌ పదవుల భర్తీని వివరించనున్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు 25 లక్షల వరకూ వైద్య చికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించనున్నారు. 
 
ఏడాదిలోనే హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా రాయలసీమ చివరి భూములకు తొలి సారి సాగు నీరు అందించిన విషయాన్ని తెలపనున్నారు. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5 శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చెప్పనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ‘అడవితల్లి బాటలో’ కార్యక్రమం ద్వారా 1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని వివరిస్తారు.