కేరళ కాంగ్రెస్ నేతలకు `సుప్రీం’ కోర్టు ధిక్కార నోటీసులు 

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్‌పై, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ సుప్రీంకోర్టు శుక్రవారం ధిక్కార నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థను బెదిరించడానికి గానీ, న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకోవడానికి గానీ భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించరాదని పేర్కొంది. 
జస్టిస్‌లు అరవింద్ కుమార్, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం, రాజ్యాంగం సర్వోన్నతమైనదని, ఏ వ్యక్తి గానీ, రాజకీయ సంస్థ గానీ దానికి అతీతం కాదని స్పష్టం చేసింది.
కోర్టు తీర్పులు విమర్శలకు అతీతం కానప్పటికీ, న్యాయవ్యవస్థ అధికారాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను కఠినంగా ఎదుర్కోవాలని అది పేర్కొంది. “న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకోవడానికి భావప్రకటనా స్వేచ్ఛ అనేది బెదిరింపులకు ఒక కవచం కాజాలదు,” అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కోర్టుల అధికారం చట్టబద్ధమైన పాలనపై ఆధారపడి ఉంటుందని, దానికి రాజకీయ మద్దతు అవసరం లేదని వారు జోడించారు. “న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం అనేది రాజకీయ సౌలభ్యం కోసం చేసే పని కాదు,” అని కోర్టు పేర్కొంది.

 కాంగ్రెస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ పార్టీ వాదనలను వినిపించారు. పార్టీ అగ్రనాయకత్వం అనుమతి లేకుండానే ఆ పోస్టు సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయిందని, విషయం తెలిసిన వెంటనే దానిని తొలగించడమే కాకుండా బేషరతుగా క్షమాపణ కోరామని బెంచ్ కు కోర్టుకు విన్నవించారు. ఈ క్షమాపణపై జస్టిస్ అరవింద్ కుమార్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు, “ఈ అఫిడవిట్ మీ కలం నుండి వచ్చిందా లేక మీ హృదయం నుండి వచ్చిందా అని మేము చూస్తాము” అని వ్యాఖ్యానించారు.

క్షమాపణలోని చిత్తశుద్ధిని, నిజాయితీని అంచనా వేసిన తర్వాతే తదుపరి చర్యను పరిశీలిస్తామని ధర్మాసనం సూచించింది. దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని, ఏ ఒక్క వ్యక్తి లేదా రాజకీయ పార్టీ కూడా దీనికి గానీ, చట్టానికి గానీ ఎంతమాత్రం అతీతం కాదని బెంచ్ తేల్చి చెప్పింది. ఈ విషయం క్రిమినల్ లేదా సివిల్ ధిక్కరణకు సంబంధించినదా కాదా అని పరిశీలించడంలో సహాయపడటానికి, ధర్మాసనం ఒక సీనియర్ న్యాయవాదిని నిపుణుడిగా నియమించింది.

అది అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సహాయాన్ని కూడా కోరింది. రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడటం ప్రజాస్వామ్యంలో అత్యంత ఆవశ్యకమని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానాలు వెలువరించే తీర్పులపై విమర్శలు చేసే హక్కు పౌరులు, సంస్థలకు ఉంటుందని పేర్కొంటూ అయితే ఆ భావప్రకటన స్వేచ్ఛ జ్యుడీషియరీకి ఆటంకం కలిగించేలా, బెదిరింపులకు గురిచేసేలా వాడుకోలేరని చెప్పింది. 

రాజ్యాంగం, చట్టబద్ధంగా న్యాయస్థానాలకు సంక్రమించిన అధికారాలు, ప్రాబల్యాన్ని తగ్గించడానికి గానీ, న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా ఉక్కుపాదంతో అణచివేయక తప్పదని హెచ్చరించింది.  

About The Author