ముంబైలో అమితాబ్ తో సహా బాంబు బెదిరింపుల కలకలం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ జుహులోని నివాసం జల్సా, బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), వర్లీ రేస్‌కోర్స్‌తో సహా నగరంలోని పలు ప్రముఖ ప్రదేశాలలో పేలుళ్లు జరుపుతామని హెచ్చరిస్తూ వచ్చిన ఒక బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఈమెయిల్ బాంబే హైకోర్టుకు అందినట్లు సమాచారం. ఆయా ప్రదేశాలలో వరుస పేలుళ్లు జరుపుతామని అందులో పేర్కొన్నారు. 
 
ఈ బెదిరింపు నేపథ్యంలో, ముంబై పోలీసులు భద్రతా సంస్థలను అప్రమత్తం చేసి, గుర్తుతెలియని పంపినవారిని గుర్తించి, ఈమెయిల్ మూలాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు ప్రారంభించారు. వీటితో పాటు వర్లీ రేస్‌కోర్స్‌లోనూ పేలుళ్లు జరుగుతాయని పేర్కొంటూ కోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్ అందింది.  బెదిరింపు ఈ-మెయిల్‌ను పంపిన వ్యక్తి ఎవరో గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 
అమితాబ్ బచ్చన్‌ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడం ఇది రెండోసారి. గత అక్టోబర్ 22న నగరంలోని ఓ పాఠశాలకు ఆయన పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ముంబై మేయర్ రితు తావ్డే, డిప్యూటీ మేయర్ సంజయ్ ఘడిలకు కూడా పంపిన ఆ మెయిల్‌లో, అక్టోబర్ 31న ఒక పాఠశాలపై గ్రెనేడ్ దాడి చేస్తామని హెచ్చరించడంతో పాటు, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య బచ్చన్ జుహులోని ఇంటిని లక్ష్యంగా చేసుకుంటామని కూడా బెదిరించారు.

అయితే ఆ సమయంలో అమితాబ్ బచ్చన్‌కు ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.  ఖలిస్థాన్’ గురించి ప్రస్తావించిన ఆ మెయిల్‌లో, నవంబర్ 27న మహాలక్ష్మి రేస్ కోర్స్ ప్రాంతంలో జరగనున్న గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కచేరీ సందర్భంగా దాడి జరుగుతుందని కూడా పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ తన ముంబై నివాసం వెలుపల ఆదివారం కనిపించిన తీరు చర్చనీయాంశమైంది. 

తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి బుల్లెట్‌ గ్లాస్ వెనుక నిలబడి అభిమానులను కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు, వారి కుటుంబాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని అఖిల భారత సినీ కార్మికుల సంఘం కోరింది. ఇటీవల సెలబ్రిటీల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో తాజా బెదిరింపులు చోటుచేసుకున్నాయి.

అక్టోబర్ 18న నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగిన ఘటనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ పరిణామం సినీ ప్రముఖుల భద్రతపై మరింత చర్చకు దారితీసింది.  ఈ వారంలోనే నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు అందాయి. అయితే ఈ బెదిరింపు టేపుల ప్రామాణికతను పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

మరోవైపు, తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు బెదిరింపులు పంపిన కేసులో బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల ఐటీ ఇంజనీర్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడికి బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు, వాటి అసలు ఉద్దేశాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

About The Author