ఎట్టకేలకు తిరుప్పరంకుండ్రంలో దీపథూన్ వద్ద వెలిగిన కార్తీకదీపం

 
తమిళనాడులో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారిన తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది. అన్ని ఆటంకాలను దాటుకుని, సుప్రీంకోర్టు ఆదేశాలతో కొండపై ఉన్న దీపథూన్ వద్ద శనివారం దీపం వెలిగించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. కోర్టు ఉత్తర్వులతో భారీ బందోబస్తు నడుమ దీపారాధన కార్యక్రమం జరిగింది. 
 
కొండపై జరిగిన ఈ వేడుకకు కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు.  మిగిలిన వారు కొండ దిగువన వేచి ఉండగా, వారిలో చాలామంది తమతో పాటు దీపాలను తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు సంబంధించి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు,  న్యాయపరమైన చర్యల మధ్య ఈ దీప ప్రజ్వలన కార్యక్రమం జరిగింది.
 
“వెట్రివేల్ మురుగనుక్కు అరోహరా” , “వెట్రివేల్, వీరవేల్” అనే నినాదాల మధ్య దీపం వెలిగించారు. కొండపై ఉన్న రాతి స్తంభం (దీపస్తంభం)పై జ్వాల కనిపించగానే భక్తులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. దూప్‌థూన్ వద్ద దీపం చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ‘హరోం హర’ నినాదాలతో తిరుపరంకుండ్రం గిరి పరిసరాలు మార్మోగాయి.
ఈ కార్యక్రమం కోసం 30 కిలోల నెయ్యి, 50 మీటర్ల పొడవైన నూలు వత్తి, 5 కిలోల కర్పూరాన్ని ఉపయోగించారు. ఇక్కడ దీపం వెలిగించేందుకు వందేళ్లుగా హిందువులు పోరాటం జరుపుతున్నారు.  సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఈ దీపాన్ని వెలిగించారు. సుప్రీంకోర్టు నియమించిన న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ జడ్జి వైద్యనాథన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేశారు. 
 
అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారమే ఈ కార్యక్రమం నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. నవంబరు 24న ఒక్క రోజు కార్తీకదీపం వెలిగించాలని సుప్రీంకోర్టు నవంబరు 20న ఉత్తర్వులు వెలువరించింది. కానీ, ఈ విషయంలో టీవీకే ప్రభుత్వం విఫలమైంది. దీంతో మదురై కలెక్టర్ కోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌లో క్షమాపణలు చెప్పారు. 
 
అయితే, అత్యున్నత న్యాయస్థానం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబరు 28న దీపం వెలిగించాల్సిందేనని రెండు రోజుల కిందట తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించడమే కాదు.. కొండ చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించాలని పేర్కొంది. 
 
మరోవైపు, తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ప్రస్తావిస్తూ న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించడంలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమని పేర్కొంటూ రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.

‘‘కొండ ప్రాంతం మొత్తాన్ని సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించడం, ఆలయ పాలక మండలిని రద్దు చేసి మాజీ జడ్జిల కమిటీకి బాధ్యతలు కట్టబెట్టడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, దేవాదాయ శాఖ కమిషనర్, మదురై కలెక్టర్ సహా ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.

న్యాయస్థానంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని డీఎంకే అధినేత దుయ్యబట్టారు. బాధ్యత తీసుకోవాల్సిన చోట ధర్మకర్తల మండలిని సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. దశాబ్దాల పోరాటంతో ద్రవిడ ఉద్యమం సాధించుకున్న హక్కులను, ప్రజల నియంత్రణలోకి తెచ్చిన ఆలయ వ్యవస్థను ప్రస్తుత సర్కారు ఒక్క కేసుతో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే పరిస్థితి తెచ్చిందని మాజీ సీఎం విమర్శించారు. 

 
గతంలో తమ ప్రభుత్వం తరతరాలుగా వస్తున్న ఆచారాలను, మత సామరస్యాన్ని కాపాడిందని ఆయన గుర్తు చేశారు. ఇతరులకు తన బాధ్యతను అప్పగించి, సీఎం కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని, అనుభవజ్ఞులు, మేధావుల సలహాలను తీసుకోకపోవడమే సమస్యలకు కారణమని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సీఎం మౌనంగా ఉండటం యావత్తు తమిళనాడుకు చేసే చారిత్రక ద్రోహమని ఆయన అభివర్ణించారు.

About The Author