నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతుపై భరోసా!

వివిధ రాష్ట్రాల్లో తాజాగా మారిన రాజకీయ పరిణామాలు, మొన్నటి వరకూ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించిన డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీలు కొంత మెత్తబడినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో  నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడగట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 

సభలో సభ్యుల హాజరు సగానికి (50%) పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. 

రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 245 మంది సభ్యులు సభకు హాజరైతే, 161 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది.  లోక్‌సభలో ఎన్డీయేకి ప్రస్తుతం 320 (20 మంది టీఎంసీ ఎంపీలు, ఆరుగురు శివసేన ఎంపీలతో కలిపి) మంది సభ్యుల మద్దతు ఉంది. 

శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ)కి చెందిన 8 మంది ఎంపీలు కూడా బిల్లుకు అనుకూలంగా ఓటేయబోతున్నట్టు ఆ పార్టీ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సూలే తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఇదే విషయమై ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని తమ 8 మంది ఎంపీలను ఆదేశిస్తూ ఆ పార్టీ ఇప్పటికే విప్‌ జారీచేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

తమిళనాడులో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని, ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే (22 మంది ఎంపీలు) ఈ బిల్లుపై తమకున్న సంపూర్ణ వ్యతిరేకతను కొంత సడలించింది. డీలిమిటేషన్‌ తర్వాత కూడా పార్లమెంట్‌ స్థానాల్లో తమిళనాడుకు దక్కే 7.2 శాతం వాటా అలాగే ఉండేలా చూసుకోవాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తున్నది. ఇదే విషయమై ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ తాజాగా ట్వీట్‌ కూడా చేశారు. 

తాజాగా ప్రభుత్వం ఈ బిల్లులో 50 శాతం పెంపునకు సంబంధించిన నిబంధనను చేర్చడంతో డీఎంకే సదరు బిల్లుకు అనుకూలంగా మద్దతు ఇచ్చే అవకాశమున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మద్దతుతో ఎన్డీయే బలం 350కు చేరుతుంది. ఏపీలోని వైఎస్సార్‌సీపీ (4 ఎంపీలు) కూడా బిల్లుకు అనుకూలంగా ఓటేయనున్నట్టు సమాచారం. ఫలితంగా ఎన్డీయే బలం 354కు చేరనున్నది. 

మరో ఆరు ఓట్ల కోసం ఎన్డీయే, ఇండియా కూటమిల్లో లేనటువంటి జేపీఎం, ఏఎస్‌ఎం, ఎంఐఎం, ఆప్‌తో పాటు స్వతంత్రుల మద్దతును కూడగట్టే అవకాశమున్నట్టు సమాచారం. కాగా, రాజ్యసభలో ఎన్డీయేకు 154 మంది సభ్యుల మద్దతు ఉంది. లోక్‌సభలో కనీసం ముగ్గురు ఎంపీల హాజరుపై సందిగ్ధత నెలకొన్నది. 

టీఎంసీకి చెందిన కళ్యాణ్‌ బెనర్జీని జూలైలో జరిగిన వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి సభ నుంచి సస్పెండ్‌ చేశారు. వచ్చే వారం జరగనున్న ఈ ప్రత్యేక సమావేశం వర్షాకాల సమావేశాల కొనసాగింపుగా ఉండనున్న కారణంగా ఆయన ఓటు వేయడానికి అనుమతి ఉంటుందో లేదో స్పష్టత లేదు. అలాగే, కశ్మీర్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి షేక్‌ రషీద్‌, పంజాబ్‌కు చెందిన వారిస్‌ పంజాబ్‌ దే పార్టీకి చెందిన అమృత్‌పాల్‌ సింగ్‌ అనే ఇద్దరు ఎంపీలు ఇంకా జైల్లోనే ఉన్నారు. 

ప్రతిపక్ష కూటమిలో భాగమైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన అగా రుహుల్లా ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఒక్కరే మిగిలారు. ఇదే సమయంలో 37 మంది సభ్యులున్న ఎస్పీ, నలుగురు సభ్యులున్న ఆర్జేడీ కూడా ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశమున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో మొత్తం సభ్యుల హాజరు శాతం తగ్గడంతో, బిల్లుకు మద్దతును కూడగట్టడానికి అవసరమైన మెజార్టీ మార్కు కూడా తగ్గనున్నది. 

ఈ పరిణామంతో ఎన్డీయేకు సానుకూల పరిస్థితులు మరింతగా పెరిగే అవకాశమున్నట్టు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), చిన్న ఎన్‌డీయేతర సమూహాల క్రాస్‌ ఓటింగ్‌ లేదా గైర్హాజరు నిర్ణయాత్మకంగా మారాయి. రాజ్యాంగంలోని 368 అధికరణ కింద లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యను కాకుండా హాజరై, ఓటు వేసిన సభ్యుల సంఖ్యను బట్టి మూడింట రెండు వంతుల మెజారిటీని లెక్కిస్తారు. 

ఎవరు అనుకూలంగా, ఎవరు ప్రతికూలంగా ఓటు వేశారనే దాన్ని మార్చడంపైనే ఎన్‌డీయే లెక్కలు ఆధారపడి ఉంటాయి. ఒక అంచనా ప్రకారం 320 మంది ఎన్‌డీయే ఎంపీలతో పాటు 37 మంది ఎస్పీ లోక్‌సభ ఎంపీలు అందరూ అనుకూలంగా ఓటు వేసినప్పటికీ మొత్తం ఓట్లు 357కి చేరుకుంటాయి. ఇది పూర్తి పోలింగ్‌ శాతం ప్రకారం వచ్చే 360 ఓట్లకు ఇంకా మూడు ఓట్లు తక్కువ. ఎస్పీతో పాటు ఎన్‌డీయేతర సభ్యుల క్రాస్‌ ఓటింగ్‌ ప్రభుత్వానికి అత్యంత కీలకం కానున్నది.

ఓట్ల విభజన సమయంలో ఎస్పీ ఎంపీలు లేదా చిన్న విపక్ష పార్టీలు గైర్హాజరైతే లేదా ఓటింగ్‌కు దూరంగా ఉంటే ఓటు వేసే ఎంపీల సంఖ్య తగ్గి, మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం తగ్గుతుంది. ఉదాహరణకు మొత్తం ఓటింగ్‌ 540 నుంచి 522 ఎంపీలకు తగ్గితే మూడింట రెండు వంతుల మెజారిటీ 348 ఓట్లకు పడిపోతుంది. దీనివల్ల విపక్ష పార్టీ ఓట్లన్నీ లేకుండానే సుమారు 354 ఓట్లతో మెజారిటీని సాధించవచ్చు.

 

About The Author